హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు నర్సింగ్ స్కూళ్లపై సర్కారు చర్యలు చేపట్టింది. 14 నర్సింగ్ స్కూళ్లకు నోటీసులు జారీ చేసింది. 7 స్కూళ్లు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనలు అతిక్రమించినట్టు పేర్కొన్నది. మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది సరిగా లేరని నోటీసుల్లో అధికారులు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన స్కూళ్లను రద్దు చేయాలని డీఎంఈ కార్యాలయం ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిసింది. ఎవరినీ ఉపేక్షించొద్దని లేఖలో కోరింది.
నిబంధనలు పాటించని మరో 18 నర్సింగ్ స్కూళ్లపై కూడా ఫిర్యాదులు చేసేందుకు కొంతమంది సిద్ధమవుతున్నట్టు తెలిసింది. అధికారుల తనిఖీల్లో ఒకే బిల్డింగ్లో వేర్వేరు సొసైటీల స్కూళ్లు, కాలేజీలు నడుపుతున్నట్టు సమాచారం. అనుమతుల విషయంలో అన్ని తానై వ్యవహరించిన ఓ మహిళా ఉన్నతాధికారి ఎక్స్టెన్షన్ విషయంలోనూ సర్కారు సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. పదవి కాలం పొడిగించేది లేదని సదరు అధికారికి తేల్చిచెప్పినట్టు సమాచారం. నర్సింగ్ స్కూళ్ల లో అక్రమాలపై ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో ‘అడ్డగోలుగా నర్సింగ్ స్కూళ్ల దందా!’, ‘నర్సింగ్ స్కూళ్లలో అక్రమాలు!’ పేరిట వరుసగా వచ్చిన కథనాలతో సర్కారులో కదలిక రావడంతోపాటు వెంటనే చర్యలకు ఉపక్రమించింది.