Rythu Bima Scheme | హైదరాబాద్, మే 21(నమస్తే తెలంగాణ)/షాబాద్: ఇప్పటికే రైతుభరోసాకు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు రైతుబీమాకు కూడా ధోకా ఇచ్చింది. ప్రభుత్వం రైతుల తరఫున ఎల్ఐసీకి చెల్లించాల్సిన బీమా ప్రీమియంను సకాలంలో చెల్లించడం లేదు. ఫిబ్రవరిలో చెల్లించాల్సిన ప్రీమియంను ప్రభుత్వం ఇంకా చెల్లించకపోవడంతో ఎల్ఐసీ మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపులు నిలిపివేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వందలాది రైతు కుటుంబాలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నాయి. వివిధ కారణాలతో రైతులు మరణిస్తుంటే.. ఆయా కుటుంబాలు అనుభవిస్తున్న ఆర్థిక కష్టాలను చూసి చలించిన నాటి సీఎం కేసీఆర్ రైతుబీమా పథకాన్ని అమలుచేశారు. ఈ పథకం కింద 18 నుంచి 59 ఏండ్ల వయస్సు గల రైతులకు ప్రభుత్వం తరఫున ఉచిత బీమా చేయించారు. రైతు ఏ కారణంతో చనిపోయినా సరే ఆ రైతు కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం చెల్లించే ఏర్పాటుచేశారు.
ఇందుకోసం ఎల్ఐసీతో ప్రత్యేకంగా ఒప్పందం చేసుకున్నారు. రైతులపై బీమా ప్రీమియం భారం కూడా పడొద్దనే సదుద్దేశంతో ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈవిధంగా ఏటా ఆగస్టులో ఒక్కొక్క రైతుకు రూ.3,556 చొప్పున సుమారు రూ.1,400 కోట్ల వరకు ఎల్ఐసీకి ప్రీమియం చెల్లిస్తూ వచ్చింది. దీంతో దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే.. నెల రోజుల్లోపే రూ.5 లక్షల పరిహారం నామినీ ఖాతాలో జమయ్యేది. 2018 ఆగస్టు 15న ఈ పథకానికి కేసీఆర్ శ్రీకారం చుట్టగా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ఈ పథకం నిరాఘాటంగా కొనసాగింది
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుబీమా ప్రీమియం చెల్లింపుల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నది. రెండో విడత ప్రీమియం కింద ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.700 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. కానీ, ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో ఎల్ఐసీ పరిహారం చెల్లింపును నిలిపివేసింది. రైతుల నుంచి విమర్శలు రావడం, ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టిగా ప్రశ్నించడంతో కొంత కొంత చెల్లిస్తూ వచ్చింది. ఇంకా రూ.100 కోట్ల వరకు బకాయి ఉన్నట్టు తెలిసింది. దీంతో ఈ మేరకు ఎల్ఐసీ రైతు కుటుంబాలకు పరిహారం నిలిపివేస్తున్నది. ఫిబ్రవరి నుంచి మరణించిన రైతులకు సంబంధించిన పరిహారం ఆయా కుటుంబాలకు అందడంలేదని తెలుస్తున్నది.
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 117 మంది రైతులు చనిపోయారు. ఆయా రైతు కుటుంబాల సభ్యులు బీమా పరిహారం పొందేందుకు అవసరమైన సర్టిఫికెట్లను సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు అందజేశారు. కానీ, వారికి ఇంతవరకు బీమా డబ్బులు అందలేదు.
సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే, తమ వద్ద ఏమీ పెండింగ్లో లేదని, డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాతాధికారులకు పంపించామని అంటున్నారని మృతుల కుటుంబసభ్యులు చెప్తున్నారు. వరంగల్ జిల్లాల్లో సుమారు 100 మంది రైతులు మరణించగా ఆయా కుటుంబాలకు పరిహారం అందలేదని తెలుస్తున్నది. ఈవిధంగా రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో రైతు కుటుంబాలు పరిహారం అందక దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నాయి. గతంలో రైతు మరణించిన 15 నుంచి నెల రోజుల్లో పరిహారం పైసలు అకౌంట్లో జమయ్యేవి. కానీ, ఇప్పుడు రెండు మూడు నెలలు గడిచినా రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.