రైతులపై సర్కార్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. రెండేండ్లుగా కాలువల నిర్వహణ బాధ్యతను మరచి మంగళవారం ఉన్నఫలంగా నీటిని వదలడంతో సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్ కాలువకు గండిపడింది. మొత్తం తుంగ, పూడికతో నిండిన కెనాల్లోకి నీళ్లు వదలడంతో ఎల్లారెడ్డిపేట-పెద్దమాసాన్‌పల్లి శివారులో కాలువకు అర్ధరాత్రి పెద్ద గండి పడి పొలాలు మునిగిపోయాయి.
తొగుట, జనవరి 28 :ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిర్వహణ లేక మల్లన్న సాగర్ కాలువకు గండిపడింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ప్రధాన కాలువతోపాటు ఉప్పర్‌పల్లి, చిన్నశంకరంపేట, రామాయంపేట కాలువల నిర్వహణను కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా పట్టించుకోలేదు. దీంతో కాలువల్లో తుం గ, పూడిక నిండిపోయాయి. కేసీఆర్ పాలనలో యా సంగికి ముందే కాలువల్లో పూడికను, తుంగను తొలగించిన తర్వాత సాగునీటిని వదిలేవారు. యాసంగి సాగుకు రైతులు వరినాట్లు వేసినా నీళ్లివ్వకుండా సర్కార్ కాలయాపన చేయడంతో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు లేఖ రాయడంతోపాటు స్వ యంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఈఎన్సీ అమ్జద్‌ఖాన్‌కు ఫోన్‌చేసి కోరారు.
దీంతో ప్రభుత్వం స్పందించి ఆగమేఘాల మీద మల్లన్నసాగర్ నుంచి మంగళవారం నీటిని విడుదల చేశారు. నీటిని ఎక్కువ మోతాదులో వదలడంతో కాలువలో తుంగ, పూడిక పేరుకుపోయి ఉండటంతో నీళ్లు కొన్ని గంటల్లోనే కాలువ మీది నుంచి ప్రవహించాయి. దీంతో ఎల్లారెడ్డిపేట-పెద్దమాసాన్‌పల్లి శివారులో కాలువకు అర్ధరాత్రి గండిపడింది. పెద్దమాసాన్‌పల్లి రైతు కొమురయ్య పొలం కావలి కోసం వచ్చి అందులో చిక్కుకుపోవడంతో గడ్డ మీదనే ఉండి రైతులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. రైతులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో నీటిని నిలుపుదల చేశారు. లేనిపక్షంలో ఎల్లారెడ్డిపేట చెరువు కట్ట కూడా తెగిపోయేదని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.