హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ (Polytechnic) విద్య ఒకవైపు పాలపొంగును తలపిస్తుండగా, మరోవైపు సమస్యల సుడిగుండంలో ఈదుతున్నది. ఒకవైపు అడ్మిషన్లు వెల్లువలా వస్తుంటే, మరోవైపు పలు కాలేజీల్లో లెక్చరర్ల కొరత వేధిస్తున్నది. కీలకమైన బ్రాంచీల్లో బోధించేవారే కరువయ్యారు. దీంతో అడ్మిషన్లు పెరిగినా, బోధనా సిబ్బంది లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 1,801 బోధనా సిబ్బంది పోస్టులుంటే ప్రస్తుతం 1,377 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఏకంగా 424 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బోధనేతర సిబ్బంది పోస్టులు సగం ఖాళీగా ఉన్నాయి. మొత్తం 2,058 ఉంటే, ప్రస్తుతం 1,004 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఏకంగా 1,054 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఇటీవలీ కాలంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో చేరే వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ప్రత్యేకించి సర్వహంగులు గల ప్రభుత్వ కాలేజీల్లోనే విద్యార్థులు అధికంగా చేరుతున్నారు. ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు కావడం. వీటిని పూర్తిచేయడం వల్ల మూడేండ్లలోనే మంచి ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం ఉండటంతో విద్యార్థులు ఈ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. అదే ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థులు అంతగా చేరడం లేదు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 80 శాతం సీట్లు నిండుతున్నాయి. కానీ ప్రైవేట్ కాలేజీల్లో 50శాతం లోపే సీట్లు నిండుతున్నాయి. అయితే ప్రభుత్వ కాలేజీల్లో 400 పైచిలుకు పోస్టులు ఖాళీగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.