Telemedicine | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : బస్తీదవాఖానల్లో స్పెషాలిటీ వైద్య సేవలకు సర్కారు నిర్లక్ష్యపు సుస్తీ చేసింది. ముఖ్యంగా రోగులకు వైద్యం అందడంలో జాప్యం కలగకుండా ఉండేందుకు కేసీఆర్ సర్కారు తెచ్చిన టెలిమెడిసిన్ విధానం అటకెక్కింది. కరోనా విపత్కర సమయంలో ఎంతో మందిని ఆదుకున్న ఈ ‘ఆన్లైన్ కన్సల్టేషన్’ విధానం ఇప్పుడు అందుబాటులో లేకుండాపోయింది. గుండె, కాలెయం, కిడ్నీ, ఆర్థో తదితర సమస్యలకు స్పెషాలిటీ వైద్యం కోసం ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి ప్రభుత్వ హాస్పిటళ్లకు పనులు మానుకొని వెళ్లి, గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకుండా స్థానికంగా ఉండే ఆరోగ్య కేంద్రాల్లోనే అందిన టెలిమెడిసిన్ విధానం ఇప్పుడు అమలుకాకపోవడంపై రోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. సాధారణ ప్రసవాలను పెంచి, ప్రసూతి మరణాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ కిట్స్, అమ్మఒడి వంటి సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ సర్కారు స్వస్తి పలకడమేగాక ఇప్పుడు నిరుపేదలకు ఎంతో మేలుచేసిన టెలిమెడిసిన్‌ను సైతం ఆపివేసిందని రోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
నాడు బస్తీ దవాఖానల్లోనే ఉచితంగా ఖరీదైన వైద్యసేవలు
ఖరీదైన సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను పేదలకు ఉచితంగా, ఇంటి దగ్గర్లోనే అందించాలని నాటి కేసీఆర్ సర్కారు హైదరాబాద్ నగర పరిధిలో తొలుత పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెలిమెడిసిన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. కరోనా సమయంలో ప్రైవేట్ దవాఖానలు సైతం మూతపడిన సమయంలో రోగులకు ఈ సేవలు వరంగా మారడంతో క్రమంగా గ్రేటర్ పరిధిలోని పలు బస్తీ దవాఖానలకు సైతం విస్తరించింది. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి హాస్పిటళ్లకు వెళ్లాలంటే నిరీక్షణ తప్పని పరిస్థితి. సమయం లేక ప్రైవేట్‌కు వెళితే నిలువు దోపిడీ తప్పకపోయేది. వీటికితోడు కొందరు ఆరోగ్య సమస్యను ప్రారంభ దశలో గుర్తించక పరిస్థితి విషమించడంతో పెద్ద దవాఖానలకు పరుగులు తీయాల్సి వచ్చేది. ఇలాంటివి దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ సర్కారు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో మొదట 85 యూపీహెచ్‌సీలు, 40బస్తీ దవాఖానల్లో టెలిమెడిసిన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. క్రమంగా మరిన్ని బస్తీ దవాఖానలకు ఈ సేవలను విస్తరించింది.
నిన్నమొన్నటిదాకా ఇలా..
గతంలో ముందుగానే బస్తీ దవాఖానల్లో పేర్లు నమోదు చేసుకుని అపాయింట్మెంట్ ఇచ్చేవారు. నిర్ణీత సమయానికి వెళ్తే వీడియోకాల్ ద్వారా ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి పెద్ద దవాఖానల నుంచి సంబంధిత వైద్యులు నేరుగా రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకునే వారు. మందులు కూడా ఆన్లైన్లో రాసిస్తే బస్తీ దవాఖానల్లోని సిబ్బంది అది ప్రింట్ తీసి ఇచ్చేవారు. సమస్య తీవ్రంగా ఉన్నట్టయితే వైద్యపరీక్షలు రాసేవారు. ప్రస్తుతం బస్తీ దవాఖానల్లోనే కాకుండా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ టెలిమెడిసిన్ అందుబాటులో లేదని రోగులు వాపోతున్నారు. సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యల కారణంగానే కొన్నిచోట్ల సేవలు అందడం లేదని ఓ అధికారి తెలిపారు.