హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీచేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 20 మంది అధికారులకు కొత్త పోస్టింగ్‌లు ఇస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు జీవో జారీచేశారు. వీరిలో యువ ఐపీఎస్‌లను ఎక్కువగా ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేయగా, అడిషనల్ ఎస్పీ బాలకోటిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఈ బదిలీల్లో సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా ఉన్న గజరావు భూపాల్‌ను ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్ ఐజీగా బదిలీతోపాటు అదనంగా స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ ఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డీఐజీగా ఉన్న అభిషేక్ మొహంతిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఐజీగా బదిలీ చేశారు. జే రంజన్ రతన్‌కుమార్ సైబరాబాద్ ట్రాఫిక్ విభాగంలోని అడ్మినిస్ట్రేషన్, రీటమ్ సెల్, ఈ-చలాన్, రోడ్డు భద్రతా విభాగానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తారు. ఈ కొత్త బదిలీలతో హైదరాబాద్, సైబరాబాద్, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల పరిధిలో పోలీస్ యంత్రాంగంలో కీలకమార్పులు చోటుచేసుకున్నాయి. బదిలీ అయిన అధికారులంతా తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది.
