హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నది. ఈ అంశంపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)లోనూ స్పష్టత ఇవ్వలేదు. వారం రోజులపాటు నిర్వహిస్తామంటూ చూచాయిగా లీకులు ఇస్తున్నది. వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. అనంతరం స్పష్టమైన ప్రకటన చేస్తారు. అందుకు భిన్నంగా ఈసారి ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. బీఆర్ఎస్ తరఫున సోమవారం బీఏసీ సమావేశానికి హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ.. 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, రైతులు, ప్రజాసమస్యలతో పాటు కాంగ్రెస్ సర్కారు హామీల అమలుపై చర్చ జరపాలని డిమాండ్ చేశామని, ప్రభుత్వం మాత్రం వారం రోజుల్లో సభను ముగించే ఆలోచనలో ఉన్నదని తెలిపారు. కాగా, జనవరి 2 నుంచి 5 వరకు లేదా 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారనే చర్చ జరుగుతున్నది. మరోవైపు 3వ తేదీనే సమావేశాలు ముగించేలా ప్లాన్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే సోమవారం మినహా కేవలం రెండు రోజులు మాత్రమే సభ జరిగినట్టవుతుంది. ఈ సెషన్లో ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు నీళ్ల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ సిద్ధమైంది. నీళ్లపై చర్చలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం పాల్గొనే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు తెలిపాయి.