హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులను కాంగ్రెస్ సర్కారు దారుణంగా వంచించింది. జర్నలిస్టులు స్టేటస్ సింబల్‌గా భావించే అక్రెడిటేషన్ కార్డుల్లో భారీగా కోతపెట్టింది. జర్నలిస్టుల కండ్లు బైర్లు కమ్మేలా కొత్త అక్రెడిటేషన్ల జారీ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు సోమవారం జీవో 252ను జారీచేశారు. ఇక నుంచి రెండు రకాలైన కార్డులిస్తామని, అక్రెడిటేషన్కార్డు, మీడియా కార్డు రూపంలో ఇవి ఉంటాయని తెలిపారు. అక్రెడిటేషన్ కార్డు ప్రభుత్వ సమాచారాన్ని సేకరించేందుకు రిపోర్టర్లకు గుర్తింపుగా ఉపయోగపడుతుందని, డెస్క్ జర్నలిస్టులు మీడియా కార్డును కేవలం సంక్షేమ పథకాలకు మాత్రమే వాడుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలిసారిగా డిజిటల్ న్యూస్ మీడియాకు అక్రెడిటేషన్ కార్డులివ్వనున్నారు. అది కూడా వెబ్సైట్లకు మాత్రమేనని స్పష్టంచేశారు. ఈ కొత్త నిబంధనలతో అక్రెడిటేషన్ కార్డులకు భారీగా కోతపడుతుందని జర్నలిస్టు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం గతంలో 23 వేల కార్డులివ్వగా, కొత్త జీవోతో 10 వేలకు పైగా కార్డులకు కోత పడే ప్రమాదం ఉన్నదని జర్నలిస్టు సంఘాల నేతలు చెప్తున్నారు.
కోతల నిబంధనలు
గ్యారెంటీలకు పాతర
అధికారంలోకి రాక ముందు జర్నలిస్టులకు కాంగ్రెస్ ఐదు హామీలిచ్చింది. ‘ఇది మా గ్యారెంటీ’ అంటూ ప్రచారం చేసింది. హామీలను అమలు చేయకపోగా, తాజాగా అక్రెడిటేషన్కార్డుల విషయంలో దారుణంగా వంచించింది. రూ.100 కోట్లతో జర్నలిస్టు సంక్షేమ నిధి ఏర్పాటు, హైదరాబాద్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యకు పరిష్కారం, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు జిల్లాల వారీగా ఇండ్ల స్థలాలు కేటాయింపు, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున సాయం, రిటైరైన జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం, జర్నలిస్టు హెల్త్‌స్కీమ్ ద్వారా హెల్త్‌కార్డులు ఇస్తామని హామీలు గుప్పించింది. రెండేండ్లు గడిచినా ఈ ఐదు హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకపోగా ఇప్పుడు గుర్తింపుకార్డులకు కోతపెట్టింది.
ప్రింట్ మీడియా కార్డులకు భారీగా కోత
కొత్త జీవోతో ప్రింట్ మీడియా కార్డులకు భారీగా కోతపడనున్నది. గతంలో ఎంప్యానల్మెంట్, ముద్రించే పేజీల ఆధారంగా కార్డులు జారీ చేసేవారు. ఇప్పుడు సర్క్యులేషన్‌ను ప్రామాణికంగా తీసుకున్నారు. 2.5 లక్షలకు పైగా సర్క్యులేషన్ ఉన్న పేపర్లకు ఏబీసీ సర్టిఫికెట్ తప్పనిసరి. 2.5 లక్షల లోపు నుంచి 25 వేల లోపుంటే ఏబీసీ లేదా ఆర్ఎన్ఐ సర్టిఫికెట్ ఉండాలి. 25 వేల లోపు సర్యులేషన్ ఉంటేనే సీఏ సర్టిఫికెట్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. అంతేకాకుండా కార్డులను భారీగా తగ్గించారు. 16 పేజీలు అంత కంటే ఎక్కువ పేజీలున్న పత్రికలకు రాష్ట్రస్థాయిలో రిపోర్టర్లకు 20, డెస్క్ 20, ఫొటోగ్రాఫర్లకు 4 చొప్పున కార్డులిచ్చేవారు.
ఇప్పుడు రిపోర్టర్లకు 12, డెస్క్‌కు 12, ఫొటోగ్రాఫర్లకు 2 కార్డులే ఇవ్వనున్నారు. ఎడిషన్లు ఉన్న చోట ఇది వరకు రిపోర్టర్లకు 8, డెస్క్‌కు 8, ఫొటోగ్రాఫర్లకు మూడు కార్డులిచ్చే వారు. ఈ సారి నాలుగుకార్డులే ఇస్తారు. అవీ మీడియా కార్డులు మాత్రమే. ఎడిషన్లు లేని జిల్లాల్లో రిపోర్టర్లకు రెండు, డెస్క్‌కు ఐదు, ఫొటోగ్రాఫర్‌కు ఒక కార్డు గతంలో ఇవ్వగా, ఇక నుంచి రిపోర్టర్లకు రెండు, ఫొటోగ్రాఫర్‌కు ఒకకార్డు మాత్రమే ఇస్తారు. రాష్ట్రంలోని కొన్ని పత్రికలు, మీడియా సంస్థలను టార్గెట్‌గా చేసుకొని ఈ జీవోను రూపొందించినట్టు స్పష్టమవుతున్నది. ముఖ్యంగా ప్రభుత్వ లోపాలు, లొసుగులను, అక్రమాలను వెలికి తీస్తున్న మీడియా సంస్థలే లక్ష్యంగా కార్డులకు కోత పెట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి.