హైదరాబాద్, జూలై 7(నమస్తే తెలంగాణ): క్యాబినెట్ సమావేశం ఈనెల 10న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యా హ్నం 2 గంటలకు సచివాలయంలో ఈ భేటీ జరుగనున్నది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. వాస్తవానికి జూన్ 23న నిర్వహించిన క్యాబినెట్ భేటీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై నిర్ణయం ఉంటుందని అందరూ భావించారు. కానీ, అదేరోజు బీసీ కోటాకు సంబంధించి హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఆ భేటీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోయింది. బీసీ కోటాను తేల్చడంతోపాటు సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత జరుగుతున్న తొలి క్యాబినెట్ భేటీ కావడంతో ఈ సమావేశంలోనైనా స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ కోటాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. క్యాబినెట్ భేటీలో కొత్తరేషన్ కార్డుల పంపిణీ, రాహుల్ పర్యటన, కొత్త స్టాంపుల విధానం, భూముల విలువల సవరణపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.