హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఆయిల్ పామ్ సాగులో పురోగతి సాధించని లోహియా, మ్యాట్రిక్స్, కేఎన్ బయోసైన్సెస్ కంపెనీలకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆ 3 కంపెనీలకు కేటాయించిన జోన్లను రద్దు చేసింది. ఆ జోన్లను ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్‌ఫెడ్‌కు కేటాయిస్తూ ఉద్యాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం.. రైతులు ఆయిల్ పామ్ నాట్లు వేసిన నాటినుంచి 36 నెలల్లోగా కంపెనీలు ప్రాసెసింగ్ యూ నిట్లను ఏర్పాటు చేసి, తమ ఫ్యాక్టరీ జోన్ పరిధిలోని రైతులకు సేవలు అందించాల్సి ఉంటుంది.
కానీ, కొన్ని కంపెనీలు ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, నాట్ల విస్తరణ, నర్సరీ అభివృద్ధి తదితర అంశాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. లోహియా ఎడిబుల్ ఆయిల్స్ కంపెనీకి కరీంనగర్ జిల్లాలో 6,721 ఎకరాల్లో మాత్రమే సాగులోకి తెచ్చింది. ఆసిఫాబాద్ జిల్లాలో మ్యాట్రిక్స్ కంపెనీ 1,606 ఎకరాలు, హనుమకొండలోని 9 మండలాలతోపాటు వరంగల్ జిల్లాలో కేఎన్ బయోసైన్సెస్ (ఇండియా) 2,136 ఎకరాలు మాత్రమే సాగులోకి తెచ్చాయి. దీంతో ప్రభుత్వం ఆ 3 కంపెనీలకు కేటాయించిన ఫ్యాక్టరీ జోన్లను పూర్తిగా రద్దుచేసి, ఆయిల్ ఫెడ్‌కు కేటాయించింది.