హైదరాబాద్, మర్చి 20 (నమస్తే తెలంగాణ): ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగానికి వెదురు సాగుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతో భవిష్యత్తులో ఆకుపచ్చ బంగారంగా తెలంగాణలో ‘వెదురు’ విరాజిల్లనున్నది. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో సహజ వనరులను ఉపయోగించుకొని వెదురు సాగు ప్రోత్సాహానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. కోల్ ఆధారిత పరిశ్రమలతో భవిష్యత్లో నెలకొన్న సందిగ్ధం నేపథ్యంలో వెదురు సాగు పంట ఆధారిత ఎనర్జీపై రాష్ట్ర ప్రభుత్వం మక్కువ చూపుతున్నది. మొదటి సంవత్సరం రెండున్నర లక్షల ఎకరాల్లో వెదురు సాగు చేయాలని భావిస్తోంది. కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం& కోల్ ఆధారిత ఇంధనం(ఎనర్జీ) లో 5 నుంచి 10 శాతం వరకు వెదురు ఆధారిత పెల్లెట్స్ను వాడి ఎనర్జీ ఉత్పత్తి చేసి పూర్తిస్థాయిలో వినియోగానికి ముందడుగు వేసింది. గ్రీన్ఫీల్డ్ పెల్లెట్ల మిశ్రమంతో రాష్ట్రంలో 8 కోల్ ఆధారిత ఎనర్జీ సంస్థలతో సాలీనా రూ.40 వేల కోట్లు ఆదా కూడా అవుతాయని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో రైతులకు అదనపు ఆదాయానికి, వైవిధ్య పంటలు సాగుకు అవకాశం లభించినట్లవుతుందని అటవీ, ఉద్యానశాఖలు భావిస్తున్నాయి.
రెండు రకాల జాతులు
రాష్ట్రంలో డెండ్రోకాలమస్ స్ట్రిక్టస్, బాంబుసా అరుండినేషియా అనే రెండురకాల వెదురు జాతులు ఉన్నాయి. వీటితో పాటు జాతీయ వెదురు మిషన్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా ముద్గల్లోని వెదురు ప్రదర్శన క్షేత్రంలో కొత్తగా నాలుగు జాతులను అభివృద్ధి చేస్తున్నది. ఎకరానికి రూ.30,720 రైతుకు మిగులు ఆదాయం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. వెదురు ధర కేజీ రూ.6 పలుకుతుంది. గరిష్ఠంగా రూ.10 వరకు ఉంటుంది. ఎకరానికి 6-8 టన్నుల దిగుబడి వస్తుంది.
తెలంగాణలో అనుకూల వాతావరణం
తెలంగాణలో భారీగా పెరిగిన నీటి లభ్యత నేపథ్యంలో వెదురు ఒక పంట సాగుకు మరిన్ని అవకాశాలున్నాయి. సాగు నీటిని అందిస్తే వెదురు దిగుబడి మరింతగా పెరుగుతుంది. దేశంలో 80 లక్షల నుంచి ఒక కోటి టన్నుల వెదురు కొరత ఉంది. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలి.
– ఒంటేరు ప్రతాపరెడ్డి, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్
ఇంధన కంపెనీలతో ఒప్పందం కుదిరితే మరింత లాభం
వెదురును కేవలం అటవీ మొక గానే కాకుండా పొలాల్లో సాగు చేసేందుకు అనువైన రకాలు గుర్తించాం. కేవలం నాలుగు సంవత్సరాల్లో కోతకు వచ్చే పంట వెదురు. అన్ని ప్రతికూల పరిస్థితులను సైతం తట్టుకుంటుంది. కోల్ ఆధారిత పరిశ్రమలతో ఒప్పం దం జరిగితే రాష్ట్రంలో వెదురు ఆకుపచ్చ బంగారంగా మారుతుంది.
– ఎల్ వెంకట్రామిరెడ్డి, ఉద్యాన శాఖ డైరెక్టర్