Telangana | హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగ విరమణ పొందుతున్నవారికి పెన్షన్, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్లు సకాలంలో చెల్లించడంలో రేవంత్రెడ్డి సర్కారు విఫలమవుతున్నది. ఏటా రిటైర్మెంట్ బెనిఫిట్ల భారం పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదురొంటున్నది. రానున్న ఐదేండ్లలో ఈ భారం మరింత పెరుగుతుందని ఆర్థికశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.4,210 కోట్లుగా ఉన్న పింఛన్ల వ్యయం 2023-24 నాటికి రూ.13,024 కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో ఇకపై రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం ఏటా రూ.15,000 కోట్ల నుంచి రూ.16,000 కోట్ల వరకు కేటాయించాల్సిన అవసరం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఆర్థిక, అకౌంట్స్ విభాగం అందించిన డాటా ప్రకారం.. 2023లో 1,602 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు.
2024లో ఈ సంఖ్య 7,995కి పెరిగింది. 2025లో 9,630 మంది, 2026లో 9,719 మంది, 2027లో 9,443 మంది రిటైరయ్యే అవకాశం ఉన్నది. గత పదేండ్లలో పెన్షన్ వ్యయం భారీగా పెరిగింది. 2014-15లో రూ.4,210 కోట్లు గా ఉన్న పెన్షన్ బడ్జెట్.. 2015-16లో రూ.8,217 కోట్లకు, 2023-24లో రూ.13, 024 కోట్లకు చేరింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ బడ్జెట్ను రూ.11,641.38 కోట్లకు తగ్గించారు. ఇందులో నిరుడు అక్టోబర్ నాటికే రూ.10,069.45 కోట్లు ఖర్చయ్యా యి. దీంతో వచ్చే మూడు నెలల కోసం కొత్త కేటాయింపులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏడాది కాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు అందలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెన్షనర్లకు ప్రభుత్వం దాదాపు రూ.2,000 కోట్లు బాకీ పడినట్టు తెలుస్తున్నది. ఈ బకాయిలను తీర్చేందుకు టీజీఐఐసీ భూములను తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల రుణం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు ఇటీవల సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమారతో సమావేశమై రిటైర్మెంట్ బెనిఫిట్స్ క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెప్తున్నట్టు ఉద్యోగులందరికీ ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు రావడం లేదని వాపోయారు.
21