నల్గొండ : ఆంధ్ర సీఎం చంద్రబాబు ( Chandra Babu ) శిష్యుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) పాలనలో రాష్ట్రం కరువు( Drought ) పరిస్థితులను ఎదుర్కొంటుందని మాజీ మంత్రి , ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ( Jagadish Reddy ) విమర్శించారు. నల్గొండ బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కరువును ఎదుర్కోవడంలో విఫలమయ్యిందని పేర్కొన్నారు. ప్రజల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు.
మరో 15 రోజుల్లో రిజర్వాయర్లలో ఉన్న నీళ్లు అన్ని ఖాళీ అయిపోతాయని వెల్లడించారు. గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోతున్న నీళ్లను వాడుకునే తెలివి రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో నాగార్జున సాగర్ కింద కరువులో కూడా పంటలకు నీళ్లు ఇచ్చి చూయించామని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ నీటిని కూడా సరఫరా చేయడం లేదని, ఉన్న వ్యవస్థ లను వాడుకునే తెలివి లేదని దుయ్యబట్టారు. ప్రస్తుతం 2014 కంటే ముందు ఉన్న దుర్భిక్ష పరిస్థితులు వచ్చాయని తెలిపారు.
ఆంధ్ర సీఎం చంద్రబాబు సాగర్ నుంచి యధేచ్చగా 50 టీఎంసీలను దోచుకొని పోయారని ఆరోపించారు. నల్గొండ, హైదరాబాద్ కు రానున్న రోజుల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి వస్తుందని అన్నారు. వాతావరణ నిపుణులు హెచ్చరించిన తరువాత వెంటనే సమీక్షలు జరుపవలసిన ప్రభుత్వం తాజాగా రివ్యూలు అంటూ నానా హడావుడి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు నష్టం జరిగాక షోయింగ్ చేస్తున్నారని వివరించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదని విమర్శించారు.
కన్నెపల్లి పంపులను ఆన్ చేస్తే ఎస్ఆర్ఎస్పీతో సహా అంతటా నీళ్లు ఇవ్వొచ్చని అన్నారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజులు బ్రహ్మండంగా పనిచేస్తాయని వెల్లడించారు. మంత్రి పదవికి ఉత్తమ్ అనర్హుడని, వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 150 టీఎంసీలు సముద్రం పాలు జేశారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు.