బోనకల్లు/సత్తుపల్లి టౌన్, మే 3: అన్నదాతలు పండించిన పంటలను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఎం నాయకులు, తెలంగాణ రైతు సంఘం నాయకులు విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా రైతులకు ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గంలోనే రైతులు కన్నీరు పెట్టుకుంటే.. రాష్ట్రంలోని రైతుల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా బోనకల్లు, సత్తుపల్లి మండలాల్లోని మక్క, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు, జిల్లా నాయకుడు జాజిరి శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు తదితరులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలు ఉన్నా మక్కలు, ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం కొర్రీలు పెడుతున్నదని విమర్శించారు. గన్నీ బ్యాగుల కొరత ఉన్నదని, తామే సొంతంగా కొనుక్కుంటున్నామని, లారీల కిరాయిలు కూడా తామే చెల్లించుకుంటున్నామని రైతులు చెప్తుండటం బాధాకరమని అన్నారు. లారీ డ్రైవర్లు బస్తాకు రూ.40 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు.