Facial Recognition Attendance | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దవాఖానలు, వైద్య కళాశాలల్లో పనిచేసే డాక్టర్లు, బోధనా సిబ్బందితో పాటు పారామెడికల్, అనుబంధ సిబ్బందికి మే 1 నుంచి ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు (అబాస్) విధానం అమలుకానుంది. ఇప్పటివరకు వైద్యారోగ్య శాఖలో వేలిముద్ర ద్వారా హాజరు విధానం అమలులో ఉండగా ఎన్ఎంసీ నిర్ణయంతో మార్పులు చోటు చేసుకోనున్నాయి.
రాష్ట్రంలో 638 పీహెచ్‌సీలు, 248 అర్బన్ పీహెచ్‌సీలు, 468 బస్తీ దవాఖానలు, టీవీవీపీ పరిధిలోని వైద్యులు, 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేసే బోధనా సిబ్బందికి ఈ విధానం అమలు కానుంది. అనుబంధ సిబ్బంది సైతం ఉద యం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల్లో ఉండాలి. డ్యూటీలకు డుమ్మా కొట్టే వారికి చెక్‌పెట్టడమే లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు సర్కారు చెప్తున్నది.
ఫేస్ రికగ్నైజేషన్, జియో ట్యాగింగ్‌తో తమ పర్సనల్ డాటా ప్రైవసీకి భంగం కలుగుతుందని వైద్యులు చెప్తున్నారు. ఇంటర్నెట్ సమస్య తలెత్తినప్పుడు, సర్వర్ డౌన్ అయినప్పుడు హాజరు పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎమర్జెన్సీ కేసులు వచ్చినప్పుడు సుధీర్ఘ విధులు, నైట్ డ్యూటీలు చేస్తామని, ఫీల్డ్ వర్క్‌లకు వెళ్తామని వివరిస్తున్నారు. అబాస్ ప్రతిపాదన తమ వృత్తిని అవమానించడమేనని వాపోతున్నారు.
ఇలాంటి చర్యలు డాక్టర్ల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని, ప్రజల్లో కూడా తమపై నమ్మకం పోతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే సిబ్బంది తక్కువగా ఉండడంతో తమపై పని భారం పడుతున్నదని, ఈ నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు సరికాదని చెప్తున్నారు. ఇప్పటికే అటెండెన్స్ కోసం సాంకేతికత ఉందని వివరిస్తున్నారు. అబాస్ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.