హైదరాబాద్, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ) : నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ పోస్టుపై కాంగ్రెస్ సర్కారు తీవ్ర జాప్యం చేస్తున్నది. రెండేండ్లుగా ఏర్పాటు ప్రక్రియ చేపట్టకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఏపీ ప్రభుత్వం మూడేండ్లకు ఒకసారి రెగ్యులర్ పోస్టుకు నోటిఫికేషన్ వేసి భర్తీ చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపడం లేదు. ఇటీవల ఇన్చార్జి నర్సింగ్ రిజిస్ట్రార్‌గా ఉన్న మహిళాధికారి ఉద్యోగ విరమణ పొందగా.. మరో మహిళాధికారిని ఇన్చార్జిగా నియమించారు.
ఆ పోస్టుకు నోటిఫికేషన్ లేకుండా నియమించే ప్రయత్నాలు సమాచారం. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం రిజిస్ట్రార్ పోస్టును క్రియేట్ చేసి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. గుడిసె మాదిరిగా ఉన్న ఇరుకు గదుల్లో నిర్వహించడం వల్ల పనుల కోసం రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే నర్సింగ్ ఆఫీసర్లు, సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చేవారికి కష్టమవుతున్నది.