హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో టీచర్ ఎడ్యుకేషన్ కోర్సులైన బీఎడ్, డీఎడ్ కోర్సుల సిలబస్ మార్చాలని సర్కారు నిర్ణయించింది. ఈ రెండు కోర్సులకు కొత్త సిలబస్ రూపొందించాలని నిర్ణయించింది. బుధవారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బాధ్యతను తెలంగాణ ఉన్నత విద్యామండలికి అప్పగించారు. ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, పలు వర్సిటీల వీసీలు సమావేశంలో పాల్గొన్నారు. ఇక రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లు (ఏటీసీ)గా అప్‌గ్రేడ్ చేయనుండగా, ఈ అంశంపై టీసీఎస్ ప్రతినిధులు సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. పాలిటెక్నిక్ కోర్సుల సిలబస్‌ను సైతం మార్చాలని, స్కిల్ డెవలప్మెంట్కు ప్రాధాన్యం ఇవ్వాలని, ఇంటర్న్‌షిప్‌లను ప్రోత్సహించాలని నిర్ణయించారు.
హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : కొత్త ఏడాదిలో నాలుగు కొత్త మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్‌ను విస్తృతం చేయడంలో భాగంగా క్రిటికల్ కేర్ బ్లాక్స్, ట్రామా కేర్ సెంటర్లు అందుబాటులోకి తేనున్నట్టు తెలిపారు. 10 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకొని వైద్య సేవలు అందించేలా 108 సర్వీసులను విస్తరిస్తున్నామని వెల్లడించారు.