హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ)లో ఎక్స్అఫిషియో సభ్యుల సంఖ్యను రెట్టింపు చేస్తూ గత నెల 22న కాంగ్రెస్ ప్ర భుత్వం జారీచేసిన జీవో 229 వైద్యవర్గాల్లో అగ్గి రాజేసింది. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌ను సర్కార్ నిర్వీర్యం చేసి, టీజీఎంసీ అధికారాలను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకే ప్రభు త్వం ఈ జీవో జారీచేసిందని ఆ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇంతకుముందు టీజీఎంసీలోని మొత్తం 25 మంది సభ్యుల్లో 13 మంది ఎన్నికైన సభ్యులు ఉండేవారు. మిగతా 12 మంది నామినేటెడ్ సభ్యుల్లో ప్రభుత్వం తరఫున ఆరుగురు, కాళోజీ వర్సిటీ ప్రతినిధులు ఇద్దరితోపాటు ఎక్స్అఫిషియో సభ్యులుగా డీఎం ఈ, డీహెచ్, టీవీవీపీ కమిషనర్, కాళోజీ వర్సి టీ వీసీని నియమించేవారు. కానీ, తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలో ఎక్స్అఫిషియో యో సభ్యుల సంఖ్యను 4 నుంచి 8కి పెంచిం ది. దీంతో టీజీఎంసీలో మొత్తం సభ్యుల సంఖ్య 29కి, నామినేటెడ్ సభ్యుల సంఖ్య 16 కు పెరిగింది.
వైద్య సంఘాల ఆగ్రహం
ప్రభుత్వ నిర్ణయాన్ని హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ), తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీఎస్ఆర్డీఏ), తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ-జూడా), తెలంగాణ టీచింగ్ డాక్టర్ట్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ), ఆలిండియా డెంటల్ స్టూడెంట్స్ అండ్ సర్జన్స్ అసోసియేషన్ (ఏఐడీఎస్ఏ), తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ (టీడీఎఫ్), తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (తానా) తదితర సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
జీవో 229లో ఏమున్నదంటే..
టీజీఎంసీలో ఎక్స్అఫిషియో సభ్యుల సంఖ్యను 4 నుంచి 8కి పెంచుతున్నట్టు జీవో 229లో ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, వైద్యవిద్య సంచాలకులు(డీఎంఈ), డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్), తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) కమిషనర్, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో, నిమ్స్ డైరెక్టర్‌తోపాటు ఆరోగ్య శాఖ స్పెషల్/అడిషనల్/జాయింట్/డిప్యూటీ సెక్రటరీలో ఎవరైనా ఒకరిని ఎక్స్అఫిషియో సభ్యులుగా నియమిస్తున్నట్టు పేర్కొన్నది. వీరిలో నిమ్స్ డైరెక్టర్ మాత్రమే వైద్యుడు. మిగతా వారంతా నాన్-మెడికల్ బ్యాక్‌గ్రౌండ్‌కు చెందినవారే.