కాంగ్రెస్ చేసిన తప్పిదాలు మెట్రో విస్తరణకు శాపంగా మారుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రద్దీ లేని ప్రాంతాలను ఎంపిక చేసుకుని, మెట్రోను పరుగులు పెట్టిస్తామని చెప్పడం విడ్డూరమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇదే విషయంలో ప్రతిపాదిత మార్గాల్లో ప్రయాణికుల రద్దీ ఎలా ఉందని కేంద్రం వేసిన సూటి ప్రశ్నలకు రాష్ట్ర సర్కారు, మెట్రో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ): రెండో దశ విస్తరణ పేరిట నగరంలో 162.4 కిలోమీటర్ల మెట్రోను నిర్మిస్తామని, రూ.45 వేల కోట్ల ప్రాజెక్టులకు నిధులివ్వాలని కోరితే నిత్యం ఎంత మంది రాకపోకలు సాగిస్తున్నారంటూ కేంద్రం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చింది. నిర్మాణపరంగా ఏమాత్రం గిట్టుబాటు కాని మార్గాలను ఎంపిక చేసి, మెట్రో నిర్మించాలనే అత్యుత్సాహం నగర మెట్రో విస్తరణకు అడ్డంకిగా మారుతుందనే విమర్శలు వస్తున్నాయి. నార్త్ సిటీ, రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు మీదుగా మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వమే ప్రణాళికలు రూపొందించి ఆయా మార్గాల్లో అధ్యయనం చేసింది. కానీ వాటన్నింటిని పక్కన పెట్టిన రేవంత్ సర్కారు రద్దీ లేని, నగరమే లేని ఫ్యూచర్ సిటీకి శంషాబాద్ నుంచి మెట్రోను తీసుకెళ్తామంటూ చెప్పడంతో కేంద్రమే నివ్వెరపోతున్నది. ప్రస్తుతం మూడు కారిడార్లలో 62.4 కిలోమీటర్లలో మెట్రో నడుస్తుండగా… రోజువారీ ప్రయాణికుల సంఖ్య 5.5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఉంటున్నది. కొత్తగా మరో 8 కారిడార్లతో 162.5 కిలోమీటర్ల పొడవైన మెట్రో నిర్మాణం చేపడుతామంటూ కాంగ్రెస్ సర్కారు ప్రణాళికలు రచించింది. మెట్రో విస్తీర్ణం మొత్తాన్ని 224.9 కిలో మీటర్లకు పెంచాలని ప్రతిపాదనలు రూపొందించింది. కానీ కేంద్రం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మల్లగుల్లాలు పడుతున్నది.
రెండున్నర లక్షలు దాటితేనే గిట్టుబాటు
ఏదైనా ఒక మార్గంలో కనీసం రోజుకు 2.5 లక్షల నుంచి 3 లక్షల మందికిపైగా రాకపోకలు సాగిస్తేనే మెట్రో నిర్మాణానికి అనువుగా ఉంటుందని నిపుణుల అంచనా. దేశవ్యాప్తంగా ఇదే తరహాలో మెట్రో నిర్మాణం సాగుతున్నది. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రాంతాలు శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ, రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపోలిస్, జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ మార్గాల్లో 50వేల మంది కూడా రాకపోకలు సాగించడం లేదనీ ప్యాసింజర్ లోడ్‌పై చేసిన అధ్యయనాల్లోనే తేలింది. ఇందులో ముఖ్యంగా నగరమే లేని ప్రాంతంగా, జనసంచారమే కనిపించనీ ఫోర్త్‌సిటీపై ఉన్న అత్యాశతో, రియల్ ఎస్టేట్ వంటి ఇతర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో మెట్రో మార్గానికి కాంగ్రెస్ సర్కారు స్కెచ్ గీసిందని విమర్శలు ఉన్నాయి. అసలు రద్దీ లేని ప్రాంతాలకు మెట్రో మార్గాలను ఎంపిక చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటనేది ఇప్పుడొక అంతు చిక్కని అంశంగా మారిందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
ఎయిర్‌పోర్టు మెట్రో రద్దుకు సాకులు
లక్షలాది మంది ప్రయాణికులు సులభంగా, సౌకర్యంగా ఐటీ కారిడార్ మీదుగా ఎయిర్‌పోర్టుకు చేరుకునే వెసులుబాటుతో బీఆర్ఎస్ ప్రభుత్వం రాయదుర్గం-ఎయిర్‌పోర్టు మెట్రో మార్గాన్ని ప్రతిపాదించింది. అత్యంత కీలకమైన నార్త్ సిటీలోని ప్యారడైజ్ నుంచి మేడ్చల్ మెట్రో మార్గానికి ప్రణాళికలు రచించింది. ఈ మార్గంలో మెట్రో నిర్మాణంతో కోర్ సిటీ నుంచి ఇండస్ట్రీయల్ కారిడార్ మేడ్చల్ వరకు రాకపోకలు పెరుగుతాయని అంచనా వేసింది. ప్రస్తుతం ఉన్న అరకొర రవాణా సదుపాయాలతో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులకు పరిష్కారం దొరుకుతుందనీ అంచనా వేసి ప్రాజెక్టుల రూపకల్పన జరిగితే వాటన్నింటిని రేవంత్‌రెడ్డి రద్దు చేశారు.
కోర్ సిటీ నుంచి మేడ్చల్, రాయదుర్గం, శంషాబాద్ మార్గాల్లో రోజుకు 6 లక్షల మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. కానీ అలాంటి ప్రాంతాలకు మెట్రో రద్దు చేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొత్తగా నిర్మాణమే జరగని ఫ్యూచర్‌సిటీకి మెట్రో నిర్మిస్తామంటూ చెప్పుకొస్తున్నది. లోపాభూయిష్టమైన డీపీఆర్… హైదరాబాద్ మెట్రో భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రేవంత్ సర్కారు పంపిన అసంబద్ధ ప్రతిపాదనలపై కేంద్రం సంధించిన ప్రశ్నలతో రాష్ట్ర అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారని తెలుస్తున్నది. ఇక మెట్రో విస్తరణ ఇప్పట్లో జరిగే అవకాశమే కనిపించడంలేదని ప్రభుత్వ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
03