న్యూఢిల్లీ, జూలై 4: వేర్పాటువాద నేతలు, ఉగ్రవాదులను గొప్ప వ్యక్తులుగా, దిగ్గజాలుగా కీర్తిస్తూ జమ్ము కశ్మీర్లోని ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ప్రచురించిన ఒక పుస్తకం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రభుత్వ పాఠశాలల్లోని గ్రంథాలయాలకు పంపిణీ చేసిన ఈ పుస్తకం సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో విడుదలైంది. దేశ వ్యతిరేక శక్తులను రోల్మోడల్స్గా పేర్కొంటూ చరిత్రను పూర్తిగా పక్కదారి పట్టించింది. ‘గ్రేట్ పర్సనాలిటీస్ అండ్ లెజెండ్స్ ఆఫ్ జే అండ్ కే’ చాప్టర్ పేరిట ఈ వ్యాసం ప్రచురితం కాగా, ఈ పుస్తకాన్ని హిలాల్ అహ్మద్, సంతోష్ మీనాలు ఎడిటింగ్ చేశారు. కాగా ఈ చర్యను విపక్ష బీజేపీ తీవ్రంగా విమర్శించింది. విద్యార్థుల్లో దేశభక్తిని ప్రోత్సహించడానికి బదులుగా దేశ విచ్ఛిన్నానికి ప్రయత్నించిన వ్యక్తులను ఎంతో గొప్ప వ్యక్తులుగా ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం కీర్తించిందని పేర్కొంది. ఉగ్రవాదులైన మక్బూల్ భట్, సయ్యద్ అలీ షా గీలానీ, మస్రత్ అలమ్, మిర్వైజ్ ఉమర్ ఫరూక్లను ఆదర్శప్రాయ వ్యక్తులుగా పేర్కొందని బీజేపీ విమర్శించింది. దీనిని ‘అకడమిక్ జీహాద్’గా అసెంబ్లీలోని బీజేపీ పక్ష నేత సునీల్ శర్మ అభివర్ణించారు.
ఉగ్రవాద జాబితాలో 23 మంది పాక్ టెర్రరిస్ట్లు
చట్ట విరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) కింద పాక్కు చెందిన 23 మందిని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్, లష్కరే తాయిబా, దాని అనుబంధ సంస్థల నాయకత్వ నెట్వర్క్ను కూలదోయాలన్న ధ్యేయంతో కేంద్రం ఈసారి ఉగ్రవాద జాబితాలో పేర్లను భారీగా చేర్చింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ.. ఉపా నాలుగో షెడ్యూల్లో చేర్చడానికి 23 మంది జాబితాతో నోటిఫికేషన్లు జారీ చేసింది.