మహబూబ్ నగర్ : తెలుగు భాష సాహిత్యంలో పాలమూరు సాహిత్యానికి అరుదైన గౌరవం లభించింది. ప్రసిద్ధ వాగ్గేయకారులు, ప్రజాకవి, శాసనమండలి సభ్యులు గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, అలాగే యువకవి తగుళ్ళ గోపాల్‌కు కేంద్ర సాహిత్య యువపురస్కారం లభించింది.
గోరటి వెంకన్న రచించిన వల్లంకి తాళం కవితా సంపుటికి, తగుళ్ల గోపాల్ రాసిన కవితల పుస్తకం ‘దండకడియం’కు ఈ అవార్డులు దక్కాయి. ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన ఇద్దరూ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వారే కావడం జిల్లాకే గర్వకారణమని సాహితీవేత్తలు కొనియాడుతున్నారు. పాలమూరు సాహితి అధ్యక్షులు డా. భీంపల్లి శ్రీకాంత్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
గేయరచయితగా, సినీకవిగా, తెలంగాణ ఉద్యమగొంతుకగా ప్రసిద్ధులైన గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తగుళ్ళ గోపాల్‌కు యువసాహిత్య పురస్కారం లభించిడం పట్ల పాలమూరు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువకవి తగుళ్ళ గోపాల్ రచించిన దండకడియం కవితాసంపుటికి 2019 సంవత్సరానికి పాలమూరు సాహితి అవార్డు సైతం లభించింది.