హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికే ఎన్నో రికార్డులను సాధించింది. సీఎం కేసీఆర్ మానసపుత్రిక అయిన ఈ ప్రాజెక్టు విశిష్టతలు అన్నీ ఇన్నీ కావు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌గా వినుతికెక్కింది. ఈ విషయాన్ని ఇప్పుడు గూగుల్ సైతం నిర్ధారిస్తున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది? అని నెటిజన్లు గూగుల్‌ను ప్రశ్నిస్తే.. వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టునే చూపుతున్నది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో పంచుకొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎవరు, ఎప్పుడు నిర్మించారు? ఆ ప్రాజెక్టు నిర్మాణంలో భారత ప్రభుత్వం కంట్రిబ్యూషన్ ఏమిటి? తదితర ప్రశ్నలను కూడా సంధించారు. వీటికి జవాబులు కావాలంటే గూగుల్‌ను అడగాలని సూచించారు.