Type Writing | హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఎంతో మందికి టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగావకాశాలు, ఉపాధి కల్పించిన 200 ఏండ్లకు పైగా చరిత్ర గల టైప్ రైటింగ్ కోర్సులు ఇక కాలగర్భంలో కలవనున్నాయి. ఈ కోర్సులను మూసివేసే దిశలో సాంకేతిక విద్యాశాఖ అడుగులేస్తున్నది. టైప్ రైటింగ్ పరీక్షల స్థానంలో ఇక నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీటీబీ) పద్ధతిలో పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇదే జరిగితే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, కోర్టుల్లో ప్రతీ ఏటా భర్తీచేసే వేలాది టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు మన విద్యార్థులు పోటీపడే అవకాశాన్ని కోల్పోనున్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ శాఖల్లో టైప్రైటర్లు, స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీచేయడంలేదు. కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను మాత్రమే భర్తీచేస్తున్నారు. దీంతో టైప్ రైటింగ్ కోర్సులు అనవసరమన్న భావనతోనే మూసివేస్తున్నారు. దీనిని టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్లు, విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
టైప్ రైటింగ్, షార్ట్‌హ్యాండ్ పరీక్షలను సాంకేతిక విద్యామండలి(ఎస్బీటెట్) ఏటా జూలై, డిసెంబర్లో నిర్వహిస్తున్నది. ఇవి పూర్తిగా సర్టిఫికెట్ కోర్సులు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందినవి 350 టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూషన్లున్నాయి. మరో 50 వరకు గుర్తింపులేకుండా నడుస్తున్నాయి. ప్రతి ఏడాది 4వేల మంది టైప్ రైటింగ్, వెయ్యి మంది షార్ట్‌హ్యాండ్ పరీక్షలకు హాజరవుతున్నారు. తమిళనాడు తరహాలో ఈ కోర్సులను ప్రోత్సహించాలని ఇన్స్టిట్యూట్ల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. తమిళనాడులో పదో తరగతిలోపే ప్రీ జూనియర్ అనే నూతన విధానాన్ని అమలుచేస్తున్నారు. టైప్రైటింగ్కు సమాంతరంగా కంప్యూటర్ కోర్సుల్లోనూ విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు.
టైప్ మిషన్లపై ప్రాక్టీస్ చేస్తేనే స్పీడ్, కచ్చితత్వం మెరుగవుతుంది. మన దగ్గర టైప్‌రైటింగ్ ఉద్యోగాలు లేవంటున్నారు. మరీ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, కోర్టుల్లో స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీచేస్తున్నారు కదా? ఈ కోర్సులను రద్దుచేస్తే, పరీక్షలను నిర్వహించడం ఆపేస్తే మన విద్యార్థులు ఆయా ఉద్యోగాలను కోల్పోరా? సీబీటీ పరీక్షల్లోనూ టైప్‌రైటింగ్ సిలబస్‌నే ఇచ్చారు. ఈ కోర్సులతో వచ్చే నష్టమేంటో అర్థం కావడంలేదు. ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచించి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ), టైప్‌రైటింగ్ కోర్సులను సమాంతరంగా నిర్వహించాలి. పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించాలి.
– బీ సతీశ్‌బాబు, తెలంగాణ రికగ్నైజ్డ్ టైప్‌రైటింగ్, షార్ట్‌హ్యాండ్ అండ్ కంప్యూటర్ అసొసియేషన్