ఖమ్మం పట్టణాన్ని చూస్తుంటే గర్వంగా ఉన్నది. నందనోద్యానవనంగా కనిపిస్తున్నది. ఇదేమీ మంత్రమేస్తే కాలేదు. అభివృద్ధి చేస్తే అయ్యింది. రూ.100 కోట్ల నిధులకుతోడు.. పువ్వాడ అజయ్ నిరంతరంగా కష్టపడితే సాధ్యమైంది. వాడవాడలా పువ్వాడ సామాన్యుడిలా కలియదిరిగిండు. ప్రభుత్వ విజన్, అజయ్ మిషన్ తోడయితేనే ఈ పనులు జరిగినయ్. పువ్వాడ అజయ్‌ను గెలిపిస్తే పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటడు. తుమ్మలు, తుప్పలు తెచ్చుకుంటే మీకే ముళ్లుగా గుచ్చుకుంటయి. మరి ముళ్లు కావాల్నా? పువ్వాడ పూలు కావాల్నా? అనేది ఖమ్మం ప్రజలు తేల్చుకోవాలి.
-సీఎం కేసీఆర్
CM KCR | హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ‘బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎప్పుడన్నా తెలంగాణ జెండాను భుజానికి ఎత్తుకున్నారా? మనం ఎత్తుకున్నప్పుడల్లా కాల్చిచంపారు.. రాచి రంపాన పెట్టారు. ఇక కాంగ్రెస్ నాయకుల కథ సొంతంగా ఉండదు. ఢిల్లీలో స్విచ్ వేస్తే ఇక్కడ లైట్ వెలుగుతది. ఢిల్లీ గులాముల కింద ఉండి మనం కూడా గులాములమైదామా?’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. రాబోయేదంతా కూడా ప్రాంతీయ పార్టీల యుగమేనని స్పష్టంచేశారు. ఎక్కడివాళ్లు అక్కడ ఉంటేనే ఆ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతారని, తమ ప్రాంత సమస్యలను పరిష్కరించుకుంటారని, అందు కు తెలంగాణ నిదర్శనమని ఉదహరించారు. యాభై ఏండ్లలో కాంగ్రెస్ చేయలేనిది పదేండ్లలో బీఆర్ఎస్ చేసిచూపిందని, అన్నివర్గాలను కలుపుకుంటూ పోతున్నామని చెప్పారు. మరోసారి బీఆర్ఎస్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం, ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో రావాల్సినంతగా ప్రజాస్వామ్య పరిణతి ఇంకా రాలేదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో చాలాచోట్ల ఆలోచించి ఓటు వేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని ప్రజలకు సూచించారు. బూతులు తిట్టుకోవడం, అబద్ధాలు చెప్పడం, సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడుతూ, అబాండాలు వేస్తూ.. మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణికి 134 ఏండ్ల చరిత్ర ఉన్నది. తెలంగాణ కొంగు బంగారం సింగరేణి గనులు. గతంలో వందకు వందశాతం రాష్ర్టానికే ఉండేది. చేతకాని దద్దమ్మలు, కాంగ్రెస్ నాయకులు కేంద్రం దగ్గర అప్పులు తెచ్చి, 40 ఏండ్ల వరకు తిరిగి చెల్లించలేక.. 49% సింగరేణి వాటాను అప్పనంగా కేంద్రానికి కట్టబెట్టారు’ అని కేసీఆర్ మండిప డ్డారు. స్వరాష్ట్రం సిద్ధించిన వెంటనే సింగరేణి కార్మికులకు ఇంక్రిమెంట్ ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో సింగరేణి టర్నోవర్ రూ.11 వేల కోట్లు ఉంటే.. దానిని రూ.33 వేల కోట్లకు తీసుకెళ్లామని వివరించారు. నాడు సింగరేణి లాభాలు రూ.419 కోట్లుగా ఉంటే.. నేడు రూ. 2,184 కోట్లకు చేరాయని చెప్పారు.
కొత్త నియామకాల వల్ల యువ కార్మికులతో సింగరేణి కళకళలాడుతున్నదని కేసీఆర్ చెప్పా రు. తెలంగాణ రాక పూర్వం 6,400 ఉద్యోగాలిస్తే.. తొమ్మిదిన్నరేండ్లలో 19,463 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. నాడు కాం గ్రెస్, సీపీఐ, సీపీఎం యూనియన్లు డిపెండెంట్ ఉద్యోగాలను ఊడగొడితే.. వాటిని బీఆర్ఎస్ ప్రభుత్వం పునరుద్ధరించి, తద్వారా 15,256 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు.
‘50 ఏండ్లు పాలనను కాంగ్రెస్‌కు అప్పగించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండి పదేండ్లు అవుతున్నది. ఆ రోజుకు.. ఈ రోజుకు తేడా ఏమిటి? అభివృద్ధి ఎలా జరిగింది? ప్రజలే గమనించాలి. మంచినీళ్ల బాధ పూర్తిగా లేదు. యాదాద్రి పవర్‌స్టేషన్ పూర్తయితే.. 50 వేల మెగావాట్ల విద్యుత్ వస్తుంది’ అని సీఎం కేసీఆర్ వివరించారు. ‘నాడు బోరు 600 నుంచి 800 ఫీట్లు వేస్తే కానీ నీళ్లు రాని పరిస్థితి. నేడు 739 టీఎంసీల భూగర్భజలం రీచార్జ్ అయి భూమి లోపల ఉన్నది. ఈ నీరు 2 నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సమానం’ అని చెప్పారు.
నాడు ప్రైవేట్ దవాఖానల్లో భయంకరమైన దోపిడీ జరిగిందని, స్వరాష్ట్రంలో అమ్మఒడి, కేసీఆర్‌కిట్ పెట్టిన తర్వాత దోపిడీలకు అడ్డుకట్టపడిందని సీఎం కేసీఆర్ తెలిపారు. విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చామని, 1,022 గురుకుల జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిసున్నామని చెప్పారు. వాటిల్లో చదువుకునే పిల్లలు జాతీయస్థాయి పరీక్షల్లో కూడా మంచి ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు. గత అభివృద్ధిని, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని బేరీజు వేసి, రైతులు, పేదల సం క్షేమం, మౌలిక వసతులు, కరెంటు, నీళ్లు, సాగునీళ్లు వంటివి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. రైతుబంధు, దళితబంధు వంటి పథకాలను సృష్టించిందే బీఆర్ఎస్ అని చెప్పారు.
50 ఏండ్లు పాలనను కాంగ్రెస్‌కు అప్పగించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండి పదేండ్లు అవుతున్నది. ఆ రోజుకు.. ఈ రోజుకు తేడా ఏమిటి? అభివృద్ధి ఎలా జరిగింది? ప్రజలే గమనించాలి.
– ముఖ్యమంత్రి కేసీఆర్
రాష్ట్రం రాకముందు 70-80 ఏండ్ల క్రితమే ఖమ్మం జిల్లాకు చెందిన కవి రావెళ్ల వెంకట్రామారావు.. ‘నా తల్లి తెలంగాణమ్మురా.. వెలలేని నందనోద్యానమ్మురా” అనే పాట రాశారని, నేడు నిజంగానే ఖమ్మం పట్టణాన్ని చూ స్తుంటే గర్వంగా ఉన్నదని సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఒకనాడు ఖమ్మం అంటే ఇరుకు సందులు, మురికి కాలువలు, యాక్సిడెంట్లు అని, నేడు ఖమ్మం అంటే ఆరులైన్ల రోడ్లు, దారిపొడవునా ధగధగలాడే లైట్లు, పచ్చనిచెట్లు, సందుల్లో కూడా సిమెంట్ రోడ్లు అని వివరించారు. ఒకనాడు రోడ్డు నెట్వర్క్ 400 కి.మీ ఉంటే దానిని 1,115 కిమీటర్లకు, మోరీల పొడవు 205 కిమీ ఉంటే దానిని 1,592 కిమీటర్లకు తీసుకుపోయారని వెల్లడించారు. గోళ్లపాడు కట్టల మీద ఉన్నవారికి వెలుగట్లలో పునరావాసం కల్పించి న్యాయం చేశామని వెల్లడించారు.
ఖమ్మంలో ఐటీ టవర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పెట్టించిన ఘనత కూడా బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే అజయ్‌కే దక్కుతుందని, రవాణాశాఖ మంత్రిగా హైటెక్ బస్టాండ్, రూ.40 కోట్లతో ఆర్టీసీ కల్యాణమండపం కట్టించారని గుర్తుచేశారు. పక్కనే పాలేరు రిజర్వాయర్ ఉన్నా, ఒకనాడు వారానికోసారి నీళ్లు వచ్చేవని, బిందెలు పట్టుకుని యుద్ధాలు జరిగేవని, ట్యాంకర్లు తిరిగేవని గుర్తుచేశారు. ఈరోజు దాదాపు 75 వేల నల్లా కనెక్షన్లు ఒక్క రూపాయికే ఇచ్చామని, ఆడబిడ్డలు ఇంట్లోనే ట్యాప్‌లు తిప్పుతున్నారని వివరించారు. రూ.300 కోట్లతో రఘునాథపాలెం మండలాన్ని కూడా అజయ్ అద్భుతంగా అభివృద్ధి చేశారని, ఈ రోజు వెదుకుదామన్నా మట్టిరోడ్డు లేదని, 20 కొత్త పంచాయతీలు చేయించి అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు.
‘వనమా వెంకటేశ్వరరావు వార్డు మెం బర్ నుంచి కౌన్సిలర్, ఎమ్మెల్యే, మంత్రి వరకూ ఎదిగారు. నేను కోరి అతన్ని తెచ్చుకొని టికెట్ ఇచ్చినా. కొత్తగూడెం అభ్యర్థి వనమా కాదు.. కేసీఆర్. నన్ను చూసి ఆయనకు ఓటు వేయండి. ఆయన మంచి వ్యక్తి. ఎన్నోసార్లు నా దగ్గరకి వచ్చినా పర్సనల్‌గా ఏమీ అడగలేదు. నియోజకవర్గం కోసమే నిధులు కోరిండు. అలాంటి మంచి వ్యక్తిని గెలిపిస్తే.. కొత్తగూడెం అభివృద్ధి చెందుతది. ఆ బాధ్యత నాది’ అని సీఎం కేసీఆర్ చెప్పారు. సీతారామ ప్రాజెక్టు పనులు 70% పూర్తయ్యాయని, వచ్చే టర్మ్‌లో పూర్తిచేసి, తానే ప్రారంభోత్సవానికి వస్తానని చెప్పారు. సీతారామతో ఉమ్మడి ఖమ్మం జిల్లా బంగారు తునకలా తయారవుతుందని చెప్పారు.
ఎన్నికలు ఏవైనా వజ్రాయుధమైన ఓటును ఆలోచించి వేయకపోతే ఐదేండ్లు వెనక్కి పోతాం. ఎన్నికల్లో ప్రజలు గెలిస్తేనే వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరుతాయి. అభ్యర్థి సీనియార్టీ, చేసిన పనులు, గుణగణాలు, ముఖ్యంగా అతని పార్టీ, ఆ పార్టీ తీరు, చేసిన పనులు, పోరాడిన విధానం, ప్రజల కోసం చేస్తున్న మంచిని ఆలోచించి ఓటు వేయాలి. ఎవరో చెప్పారని ఆషామాషీగా ఓటు వేయొద్దు. పార్టీ ద్వారానే ప్రభుత్వం ఏర్పడుతుంది. ఐదేండ్లపాటు ప్రజల తలరాతను రాస్తుంది. విచక్షణతో ఆలోచించి, చర్చించుకుని ఓటేయాలి. అప్పుడే ప్రజలు గెలుస్తారు.
-ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణలో బీఆర్ఎస్ది ఉద్యోగ ఫ్రెం డ్లీ ప్రభుత్వమని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ పదేండ్లలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా నల్లబ్యాడ్జీ ధరించిన దాఖలాలు లేవని అన్నారు. చిన్న ఉద్యోగులను కూడా కండ్లలో పెట్టుకొని చూస్తున్నామని వివరించారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కడుపులు నింపాలని, దేశంలోనే మొదటిసారిగా పీఆర్సీ ఇస్తే.. 30% జీతాలు పెరిగాయని చెప్పారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో కడుపుగట్టుకొని ఒక్కో అడుగు ముందుకేస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్టు వివరించారు.
ఖమ్మంలో ప్రస్తుతం కాం గ్రెస్ తరపున నిలబడ్డ తుమ్మల గతంలో ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి అజయ్ చేతిలో ఓడిపోయి మూలకు పడి ఉంటే, అందరినీ సమన్వయం చేద్దామని పిలిచి మంత్రి పదవి ఇచ్చానని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. అయినప్పటికీ ఆయన ఖమ్మం జిల్లాలో సాధించింది గుండు సున్నా అని, గత ఎన్నికల్లో అజయ్ తప్ప ఎవరూ గెలవలేదని వివరించారు. ఇప్పుడు ఆయనే తనకు మంత్రి పదవి ఇప్పించానని చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లాలో ఆ ఇద్దరి పీడను వదిలించామని, ఖమ్మం చాలా శుభ్రంగా ఉన్నదని, ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. ప్రజాస్వామ్యం లో మాటలకు కూడా పరిమితి ఉన్నదని, అందరికీ మాటలు వచ్చని, తిట్టాలనుకుంటే ఎంతో తిట్టవచ్చని, కానీ సరికాదని వివరించారు. ‘బీఆర్ఎస్ వాళ్లను ఒక్కరినీ కూడా అసెంబ్లీ గడప తొక్కనియ్య అని ఒక అర్భకుడు మాట్లాడుతున్నాడు. ఖమ్మం జిల్లా ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు దీనిని సహిస్తారా? ఇది ఎంతవరకు ధర్మం’ అని ప్రశ్నించారు. ఖమ్మం చైతన్యవంతమైన జిల్లా, పోరాటాల ఖిల్లా అని, విచక్షణతో ఆలోచించి ఎవరు గెలిస్తే తెలంగాణ సురక్షితంగా ఉంటదో ఆలోచించాలని కోరారు.
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలోనే కొత్తగూడెం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని ఆ పార్టీ కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో వనమా మాట్లాడారు. ఐదేండ్లలో సుమారు రూ.3 వేల కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. అడిగిన వెంటనే ఇండ్ల స్థలాల క్రమబద్ధీరణకు జీవో విడుదల చేశారని, దీంతో కొత్తగూడెం పట్టణంలో ఎంతో మంది ఇంటి యజమానులు అయ్యారని అన్నారు. సింగరేణి గనుల కారణంగా ఇండ్లు కోల్పోయిన ఎస్ఆర్టీ నగర్, మాయాబజార్ వాసులు, రైల్వే నిర్వాసితులు సుమారు 900 మందికి ఇండ్ల స్థలాలను ఇప్పించినట్టు చెప్పారు.
ఇదేమీ మంత్రమేస్తే కాలేదని, గోళ్లపాడు చానల్, లకారం చెరువు చిటికేస్తే కాలేదని, ఏడేండ్లు పువ్వాడ అజయ్ నిరంతరంగా పనిచేస్తే, ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులతో ఇదంతా జరిగిందని సీఎం కేసీఆర్ వివరించారు. సైకిల్ వేసుకుని ప్రజల్లో సామాన్యుడిలా పువ్వాడ కలిసిపోయి కష్టపడ్డార ని, ‘వాడవాడలో పువ్వాడ’ అనే వార్తలు పేపర్లలో వచ్చేవని కొనియాడారు. ధంసులాపూర్ బ్రిడ్జి కావచ్చు, మున్నేరు వరద ముంపు ప్రాంతాలు కావచ్చు, సుందరీకరణ కావచ్చు ఏ పనికైనా ఎంతో కొట్లాడి రూ.700 కోట్లతో ఆ పనులను అద్భుతంగా చేశారని, తీగల వంతెన కట్టి ఖమ్మం పట్టణానికి మరింత ఆందం తీసుకొచ్చేందుకు అజ య్ కృషి చేస్తున్నారని వివరించారు. ప్రభు త్వ విజన్, అజయ్ మిషన్ రెండూ తోడయితేనే ఈ పనులు జరిగాయని తెలిపారు. ‘పువ్వాడ అజయ్‌ను గెలిపిస్తే పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు. తుమ్మలు, తుప్పలు తెచ్చుకుంటే మీకు మీరే ముళ్లు గుచ్చుకుంటారు. ముళ్లు కావాలా? పువ్వాడ పూలు కావాలా? అనేది ఖమ్మం ప్రజలు తేల్చుకోవాలి’ అని పిలుపునిచ్చారు.
స్వరాష్ట్రంలో కొత్తగూడెం జిల్లా కావడంతోపాటు, మెడికల్ కాలేజీ వచ్చిందని, దానికి 70 మంది డాక్టర్లు ఉన్నారని సీఎం కేసీఆర్ చెప్పారు. కిడ్నీ రోగులకు కొత్తగూడెంలోనే డయాలసిస్ సెంటర్ ఏర్పాటుచేసి వారికి పె న్షన్ ఇస్తున్నామని చెప్పారు. ‘కొత్తగూడెంలో 16,769 ఎకరాల పోడు భూములకు పట్టా లు ఇస్తే.. 4,500 కుటుంబాలకు మేలు జరిగింది. పట్టాలివ్వడమే కాకుండా కేసులు ఎత్తివేసినం. రైతుబంధు, రైతుబీమా ఇచ్చినం’ అని చెప్పారు. కొత్తగూడెంలో రోడ్లు బాగుచేసుకున్నామని, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థతో రూపురేఖలు మారాయని తెలిపారు.
భగవంతుడి దయ తెలంగాణపై ఉన్నదని, అందువల్లే అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని సీఎం కేసీఆర్ వివరించారు. బీఆర్ఎస్ కంటే ముందు పదేండ్లు పాలించిన కాంగ్రెస్ మొత్తంగా ముస్లింల సంక్షేమానికి రూ.900 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో రూ.12 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. అందరినీ కలుపుకుపోతున్నామని, కేసీఆర్ బతికున్నంత వరకు లౌకిక రాష్ట్రంగానే తెలంగాణ ఉంటుందని భరోసా ఇచ్చారు. మైనార్టీ విద్యార్థులకు గురుకుల కాలేజీలు ఏర్పాటు చేశామని, అం దులో చదువుతున్న మైనార్టీ విద్యార్థులు ఉన్న త భవిష్యత్‌కు బాటలు వేసుకుంటున్నారని తెలిపారు. ముస్లింలు ప్రేమతో అజయ్‌కుమార్‌ను అజయ్‌ఖాన్ అని పిలుస్తారని చెప్పారు.