హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి దర్శనం, సుప్రభాత సేవకు ఓ భక్తుడు నకిలీ ఆధార్ కార్డులను వినియోగించి విజిలెన్స్ అధికారులకు అడ్డంగా దొరికాడు. బెంగళూరుకు చెందిన శ్రీధర్ నకిలీ ఆధార్ కార్డుల ద్వారా టీటీడీ లకీడిప్ సేవా టికెట్ల కోసం ఏకంగా 400 రిజిస్ట్రేషన్లు చేసినట్టు గుర్తించారు. ఇప్పటివరకు 20 సార్లు సుప్రభాత సేవ టికెట్లు పొందినట్టు తేల్చారు. బుధవారం మరోసారి సుప్రభాత సేవకు రాగా టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించి పట్టుకుని తిరుమలలో పోలీసులకు అప్పగించారు.
తిరుమలలోని తొమ్మిది పెద్ద హోటళ్లలో ఒకటైన, కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలోని బాలాజీ భవన్ హోటల్ లైసెన్స్‌ను టీటీడీ రద్దు చేసింది. ప్రస్తుతం హోటల్ చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజు రూ.76,04,196గా ఉంది. పలుమార్లు నోటీసులు జారీ చేసినా, లైసెన్సు ఫీజు చెల్లించనందుకు హోటల్ లైసెన్స్‌ను రద్దు చేసి, టీటీడీ రెవెన్యూ, హెల్త్, విజిలెన్స్ అధికారులతో కూడిన టాస్‌ఫోర్స్ బృందం హోటల్‌ను స్వాధీనం చేసుకున్నారు.