e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home Top Slides సర్కారు బడికి మహర్దశ

సర్కారు బడికి మహర్దశ

సర్కారు బడికి మహర్దశ
  • రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్‌ రూపం
  • సకల సౌకర్యాలు.. నాణ్యమైన విద్యా బోధన
  • 4 వేల కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
  • లోతుగా చర్చించిన క్యాబినెట్‌ ఉపసంఘం
  • ఏపీలోని ‘నాడు-నేడు’ తరహాలో అమలు
  • అధ్యయనం చేసి వచ్చిన విద్యాశాఖ బృందం
  • నాడు-నేడు సాఫ్ట్‌వేర్‌ ఇవ్వాలని ఏపీకి లేఖ
  • ఆ రాష్ట్ర సీఎం జగన్‌ సానుకూల స్పందన

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దీర్ఘకాలిక విజన్‌తో రాష్ట్రం ఒక్కో రంగంలో అనితరసాధ్యమైన ప్రగతిని సాధిస్తూ వస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోసిన జలాలతో తెలంగాణ తడి ఆరని మాగాణంగా మారింది.
కరోనాతో దేశమే అతలాకుతలమైన సంక్షోభ సమయాన్ని అవకాశంగా మార్చుకొని వైద్యరంగాన్ని పటిష్ఠం చేయడంపై దృష్టి సారించారు. వైద్య కళాశాలలు, నర్సింగ్‌ కాలేజీలతోపాటు మారుమూల ప్రాంతాలకు సైతం ప్రామాణిక వైద్యాన్ని చేరువచేయడం కోసం అనేక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది.
ఇప్పుడిక ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో విద్యారంగంపై దృష్టి సారించారు. ఇప్పటికే మండలానికో గురుకులాన్ని ఏర్పాటుచేసిన ప్రభుత్వం.. అన్ని బడుల్లో కార్పొరేట్‌స్థాయి వసతుల కల్పనకు కార్యాచరణ ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తున్న నాడు-నేడు తరహాలో సకల సౌకర్యాలు.. నాణ్యమైన చదువులు అందించే దిశగా చర్యలు చేపట్టింది.

హైదరాబాద్‌, జూన్‌ 17(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సర్కారు బడులకు మహర్దశ రానున్నది. ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చి విద్యార్థులకు నాణ్యమైన విద్య, సకల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరంచేసింది. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సమావేశమై లోతుగా చర్చించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం అమలుచేస్తున్న‘మనబడి నాడు-నేడు’ పథకం తరహాలో మన రాష్ట్రంలో కూడా వినూత్న పథకాన్ని అమలుచేయాలని నిర్ణయించింది. నాడు-నేడు పథకంకోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకొనేందుకు అనుమతించాలని కోరుతూ ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌కు తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా బుధవారం లేఖరాశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తెలుగు ప్రజలకు ఉపయోగపడుతుందంటే ఎలాంటి సహకారం అందించేందుకైనా సిద్ధమమని ఆ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

- Advertisement -

సర్కారు బడి కళ కళ
మన రాష్ట్రంలో 26, 025 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా తొలి దశలో గురుకుల విద్యను ప్రారంభించారు. తాజాగా ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.4వేల కోట్లు కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 2వేల కోట్లు, వచ్చే ఏడాది రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తారు. ఈ కార్యక్రమం కోసం సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటుచేశారు. బీఆర్కే భవన్‌లో గురువారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన క్యాబినెట్‌ సబ్‌కమిటీ సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ప్రైవేటు పాఠశాలలతో సమానంగా ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. కమిటీ తన సిఫారసులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు సమర్పించాలని నిర్ణయించింది. సమావేశంలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అధికారులు రామకృష్ణారావు, సందీప్‌ సుల్తానియా, రాహుల్‌ బొజ్జా, క్రిస్టినా జెడ్‌ చోంగ్తు, రఘునందన్‌రావు, దేవసేన పాల్గొన్నారు.

ఏపీలో అధికారుల అధ్యయనం
ఏపీలో ‘నాడు-నేడు’ పథకం అమలు విధానాన్ని తెలంగాణ విద్యాశాఖ బృందం పరిశీలించింది. క్యాబినెట్‌ సబ్‌కమిటీ ఆదేశాల మేరకు విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన నేతృత్వంలోని బృందం ఈ నెల 14, 15 తేదీల్లో ఏపీలో పర్యటించింది. పథకం అమలులో ఏయే అంశాలను చేర్చారు? ఏ విధానంలో ముందుకు వెళ్తున్నారు? వంటి అంశాలను అధ్యయనం చేయటంతోపాటు సాఫ్ట్‌వేర్‌ పనితీరును పరిశీలించారు. పాఠశాలల విద్యార్థులతో, స్థానికులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాడు-నేడు పథకం మంచి ఫలితాలను అందించడంతో దాని తరహాలోనే తెలంగాణలోనూ అమలుచేయాలని నిర్ణయించారు.

ఏమిటీ నాడు-నేడు?
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతంచేసేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఆ రాష్ట్రంలోని 44,512 పాఠశాలల్లో రక్షిత మంచినీరు, మరుగుదొడ్లు, విద్యుదీకరణ, ఫర్నిచర్‌, పెయిటింగ్‌, మరమ్మతులు, ల్యాబొరేటరీల వంటి తొమ్మిది రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. దీంతోపాటు ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని కూడా ప్రవేశపెట్టింది. మౌలికన సదుపాయాల కల్పన, కార్యాచరణ అమలు, తదితర సంపూర్ణ విద్యాసంబంధ అంశాలపై నాడు-నేడు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ‘స్కూల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు’ను చేపట్టింది. ఈ ప్రాజెక్టు అమలులో నాడు-నేడు సాఫ్ట్‌వేర్‌ ఉపయోగపడుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సర్కారు బడికి మహర్దశ
సర్కారు బడికి మహర్దశ
సర్కారు బడికి మహర్దశ

ట్రెండింగ్‌

Advertisement