Anganwadi Tenders | హైదరాబాద్ మే 13 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు, ఫర్నిచర్ సరఫరా కోసం ఉద్దేశించిన టెండర్లలో గోల్మాల్ జరుగుతున్నదనే ఆరోపణల్లో నిజం ఉన్నదా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. ఏడాదిన్నరగా టెండర్లు పిలవడం, ఆరోపణలు రావడం, రద్దు చేయడం రివాజుగా మారింది. గతంలో పామాయిల్, కోడిగుడ్లు, కందిపప్పు తాజాగా బెంచీల సరఫరా కాంట్రాక్టర్లను రద్దుచేయడం చర్చనీయాంశమైంది. అన్ని సందర్భాల్లోనూ అర్హులు లేకనే రద్దు చేశామని అధికారులు చెప్పడం అనుమానాలకు తావిస్తున్నది.
అధికార పార్టీ పెద్దల అనుయాయులకు టెండర్లు దక్కే అవకాశం లేకపోవడంతోనే వెనక్కి తీసుకుంటున్నారనే చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అంగన్వాడీ టెండర్లపై రాద్ధాంతం నెలకొంటున్నది. 17 నెలల కాలం లో పామాయిల్, కోడిగుడ్లు, కందిపప్పు, బెంచీలు, కోడిగుడ్ల ర్యాక్‌ల కాంట్రాక్ట్‌కు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించడం, వెనక్కి తీసుకోవడం సర్వసాధారణంగా మారింది. గత సంవత్సరం డిసెంబర్లో 35,700 అంగన్వాడీ కేంద్రాలకు పామాయిల్ సరఫరా చేసే బాధ్యతల నుంచి ఆయిల్‌ఫెడ్‌ను తప్పించి, అధికార పార్టీ నేత కంపెనీకి కట్టబెట్టేందుకు యత్నించారు.
యూనియన్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తంకావడంతో వెనక్కి తగ్గారు. ఆ తర్వాత గత మార్చిలో బెంచీల సరఫరా విషయంలోనూ ఇదేవిధంగా వ్యవహరించారు. త క్కువ ధరకు నాణ్యమైన ఫర్నిచర్‌ను అందించే ప్రభుత్వ సంస్థ జైళ్ల శాఖను పక్కనబెట్టి, నల్లగొండ జిల్లా నేతకు ఇచ్చేందుకు ఎత్తులు వేశా రు. నిబంధనలను సైతం మార్చారనే ఆరోపణలొచ్చాయి. అప్పటినుంచి ఈ కాంట్రాక్ట్‌ను పెండింగ్‌లో పెట్టారు. తన వారికి కట్టబెట్టే ప్రయత్నం విఫలం కావడంతో గుట్టుచప్పుడు కాకుండా టెండర్లను రద్దు చేశారనే ప్రచారం జరుగుతున్నది. కోడిగుడ్లు, కందిపప్పు టెండర్లను సైతం అధికార పార్టీకి చెందిన ఒక కీలక నేత అనుచరుడి కంపెనీకి ఇచ్చేందుకు యత్నించారు. నిబంధనలను సైతం మార్చారని తీవ్ర దుమారం రేగింది. దీంతో ఈ టెండర్లను కూడా రద్దుచేశారు.
అంగన్వాడీ సెంటర్లకు కోడిగుడ్లను సరఫరా చేసేందుకు గత మార్చి 30న టెండర్లు ఆహ్వానించారు. ఏప్రిల్ వరకు గడువు విధించారు. అగ్మార్క్ రిప్లికా సీరియల్ నంబర్ కలిగిన వారే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో సరఫరా చేసిన తమవారికే కట్టబెట్టేందుకు ఈ నిబంధన తెచ్చారని, రాష్ట్రంలో ఏడుగురే అర్హులున్నారనే ఆరోపణ లు వెల్లువెత్తాయి. దరఖాస్తు గడువును సైతం మే 15 వరకు పొడిగించారు. దీంతో ఆరోపణలు వెల్లువెత్తడంతో కోడిగుడ్ల టెండర్లనైనా ఫైనల్ చేస్తారా? లేదంటే కందిపప్పు, బెంచీల టెండర్ల తరహాలో క్యాన్సిల్ చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పదే పదే టెండర్లు పిలువడం, రద్దుచేయడం వెనుక కీలకమైన అధికారులు ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆయా అధికారులు తమకు అనుకూలంగా ఉన్న అధికార పార్టీ నాయకులకు ఇచ్చేందుకు యత్నించారనే ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దలను కూడా తప్పుదోవ పట్టించినట్టు తెలుస్తున్నది. అయితే, తమకు నచ్చినవారికి సదరు కాంట్రాక్ట్‌లు దక్కే అవకాశం లేకపోవడంతో మళ్లీ వారే మీడియాకు లీకులు ఇస్తూ కథనాలు రాయిస్తున్నారని అధికార పార్టీ ముఖ్యులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. అటు అధికారులు, ఇటు కొందరు అధికార పార్టీ నాయకుల వైఖరితో ప్రభుత్వం అభాసుపాలవుతున్నది.
అంగన్వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరా కోసం ఉద్దేశించిన టెండర్లలో శిశు సంక్షేమ శాఖలోని కొందరు అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నట్టు అనేక ఫిర్యాదులు అందాయి. ప్రజాసంఘాలు, అంగన్వాడీ యూనియన్ల నాయకులు అనేకసార్లు ముఖ్యమంత్రి, మంత్రులకు దీనిపై ఫిర్యాదు చేశారు. అయితే, ప్రభుత్వ పెద్దలు మాత్రం సదరు అధికారులపై చర్యలు తీసుకొనేందుకు వెనుకాడుతున్నారనే విమర్శలొస్తున్నాయి. ఆరోపణలు రాగానే టెండర్లను క్యాన్సిల్ చేయడం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హూంకరించడం తప్ప ఆచరణలో పెట్టడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.