GRIET | హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : ‘క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ లేరు.. డమ్మీలను పెట్టి నడిపిస్తున్నారు. అఫిలియేషన్ కోసం సమర్పించినవన్నీ తప్పుడు వివరాలే. కాలేజీకి మాక్ వర్చువల్ టూర్‌కు కావల్సిన ఇంటర్నెట్ సౌకర్యమే లేదు. కానీ డీమ్డ్ వర్సిటీ కోసం దరఖాస్తు చేశారు..’ అంటూ హైదరాబాద్‌లోని గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ (GRIET)పై అదే కాలేజీకి చెందిన ఉద్యోగులు ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూకు ఫిర్యాదులు చేశారు.
ఈ-మెయిల్ ద్వారా ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తంకు జేఎన్టీయూ వీసీ, రిజిస్ట్రార్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులో అనేక ఆరోపణలు చేశారు. జేఎన్టీయూ నియమించిన నిజనిర్ధారణ కమిటీని కాలేజీ యాజమాన్యం లోబర్చుకుని, అనుకూలంగా రిపోర్టులు ఇప్పించుకున్నట్టు ఉద్యోగులు ఆయా లేఖలో ఫిర్యాదుచేశారు. కాలేజీలో జరుగుతున్న విషయాలపై అనేకసార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేశామని, అయినా స్పందనలేదని విస్మయం వ్యక్తంచేశారు.