ధర్మారం/రామడుగు, మార్చి 26 : వరద కాలువకు అనుబంధంగా యాసంగిలో రైతు లు సాగుచేసిన వరి పంటలను కాపాడేందుకు గోదావరి జలాలు తరలిపోతున్నాయి. కాళేశ్వరం లింక్‌లో-2లో ఎల్లంపల్లి బరాజ్‌లోని నీటిని నంది, గాయత్రీ పంప్‌హౌస్‌ల ద్వారా ఎత్తిపోస్తున్నారు. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా నందిమేడారంలోని నంది పంప్‌హౌస్‌లో 2,3వ మోటర్లను ఆన్ చేశారు. ఒకో మోటర్ ద్వారా 3,150 క్యూసెకులు డెలివరీ సిస్టర్న్ నుంచి ఎగిసి పడుతూ నంది రిజర్వాయర్ మీదుగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు చేరుతున్నాయి.
అక్కడ రెండు బాహుబలి మోటర్ల ద్వారా కాళేశ్వరం జలాలను ఎత్తిపోస్తుండగా, సుమారు 5.7 కిలోమీటర్ల దూరం గ్రావిటీ కాలువలో ప్రయాణించి వరద కాలువ 99వ కిలోమీటర్ పాయింట్ వద్ద కలుస్తున్నాయి. బోయినపల్లి సమీపంలోని వరదకాలువ 122వ కిలోమీటర్ వద్ద ఉన్న రెగ్యులేటర్లను మూసివేయగా, నీళ్లు వరద కాలువ పునరుజ్జీవ పథకంలో నిర్మించిన మల్యాల మండలం రాంపూర్ పంప్‌హౌస్‌కు ఎదురెక్కుతున్నాయి. ఉదయం 9 గంటలకు ఎత్తిపోతలు ప్రారంభించి, సాయంత్రం 4 గంటలకు నిలిపివేశామని, తిరిగి శుక్రవారం ఉదయం మళ్లీ మోటర్లను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం 4 వరకు 0.14 టీఎంసీల నీటిని వరదకాలువలోకి తరలించినట్టు ప్రాజెక్టు డీఈఈ వెంకటేశ్ తెలిపారు.