ధర్మారం, ఆగస్టు14: కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleshwaram Project) బాహుబలి మోటర్లు జలగర్జన చేస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీళ్ల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్ హౌస్‌లో (Nandi Pump House) బుధవారం 2, 4, 5 నంబర్ల మోటార్లను నడిపించిన అధికారులు.. తాజాగా మరో పంప్‌ను ఆన్ చేశారు. కడెం ప్రాజెక్టులో గేట్లు ఎత్తడం గోదావరిలో నీటి ప్రవాహం పెరగడంతో నంది పంప్ హౌస్‌లో గురువారం ఉదయం 7.30 గంటలకు 6వ నంబర్ మోటర్‌ను ఆన్ చేశారు. దీంతో శ్రీ రాజరాజేశ్వర జలాశయంవైపు కాళేశ్వర జలాలు పరుగులు పెడుతున్నాయి.
కాళేశ్వరం అనుబంధ లింక్-2 ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి బుధవారం నుంచి నీటి ఎత్తిపోతలు ప్రారంభమైన విషయం తెలిసిందే. నంది, గాయత్రి పంపుహౌస్‌ల్లో మూడు మోటర్ల చొప్పున ఆన్ చేశారు. మొత్తంగా 9,450 క్యూసెక్కుల జలాలను మిడ్‌మానేరుకు తరలించారు. తాజాగా నంది పంప్ హౌస్‌లో 6వ నంబర్ మోటర్ ద్వారా కూడా ఎత్తిపోతల ప్రారంభించారు. ఒక్కో మోటర్ ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున 4 మోటార్ల ద్వారా 12,600 క్యూసెక్కుల చొప్పున నీరు పంపింగ్ అవుతోంది. కాగా నంది రిజర్వాయర్ ప్రధాన గేట్ల ద్వారా అదే పరిమాణంలో గ్రావిటీ కాల్వ ద్వారా వెళ్లి రెండు అండర్ టన్నెల్ల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్‌కు నీరు సరఫరా అవుతాయి. అక్కడి పంప్ హౌస్‌లో 4 మోటార్లను ఆన్ చేసి అదే పరిమాణంలో శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి నీటి సరఫరా అవుతున్నట్లు నీటిపారుదల శాఖ డీఈ గునిగంటి నర్సింగరావు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తంగా ఏడు లింకులు ఉన్న విషయం తెలిసిందే. అందులో మేడిగడ్డ ఘటనను, ఎన్డీఎస్ఏ నివేదికను సాకుగా చూపుతూ లింక్-1లోని లక్ష్మి, సరస్వతి, పార్వతి బరాజ్‌లు, పంప్‌హౌస్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం పడావు పెట్టింది. ప్రాణహిత జలాలను మళ్లించే అవకాశం ఉన్నా రాజకీయాల కోసం కాళేశ్వరం కూలిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నది. మరోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లింక్-2లోని పంపులను ఆన్ చేసి గోదావరి జలాల తరలింపును చేపట్టింది. ఎల్లంపల్లి నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి జలాలను తరలించే నీటిసరఫరా వ్యవస్థ మొత్తాన్ని లింక్-2గా పిలుస్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టు 6వ ప్యాకేజీలో భాగంగా ఎల్లంపల్లి నుంచి జలాలను తొలుత 1.1 కిలోమీటర్ గ్రావిటీ కాలువ తవ్వడంతోపాటు 9.590 కిలోమీటర్ల పొడవుతో రెండు సొరంగమార్గాలను నందిమేడారం వరకు తవ్వించారు. ఎల్లంపల్లి నుంచి విడుదలచేసిన జలాలు.. వీటి ద్వారా వచ్చి నందిమేడారం సర్జ్పూల్కు చేరుకుంటాయి. ఇక్కడ నంది పంప్‌హౌస్‌లోని మోటర్ల ద్వారా జలాలను ఎత్తి నందిమేడారం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు. ఇక్కడినుంచి జలాలను సొరంగాల ద్వారా గాయత్రి పంప్‌హౌస్‌కు తరలిస్తారు. ఇక్కడినుంచి 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బాహుబలి మోటర్లతో నీటిని ఎత్తి వరద కాలువ ద్వారా మిడ్‌మానేరుకు తరలిస్తారు. మొత్తంగా దీనిని లింక్-2గా పిలుస్తారు.