Godavari River | న్యూస్‌నెట్‌వర్క్/ హైదరాబాద్, జూలై22 (నమస్తే తెలంగాణ): కర్ణాటక, మహారాష్ట్రతోపాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రాణహిత నుంచి భారీగా వరద వచ్చి గోదావరిలో కలుస్తున్నది. లక్ష్మీబరాజ్ వద్ద 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. సోమవారం మధ్యాహ్నం వరకే 103.55 మీటర్ల మేర వరద ప్రవాహం నమోదు కావడంతో కాళేశ్వరం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దిగువన ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెరసాని నుంచి భారీగా వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం క్రమేపీ పెరుగుతున్నది. నీటి ప్రవాహం 48 అడుగుల స్థాయికి చేరుకోవడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
సోమవారం రాత్రి 10 గంటలకు గోదవారి ప్రవాహం 50.01 అడుగులకు చేరినట్టు అధికారులు తెలిపారు. వరద మరింత పెరిగే అవకాశముండటంతో ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎగువన ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు సైతం వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. భద్రాద్రి జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం భద్రాచలం వచ్చిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. తొలుత కరకట్ట పనులను పర్యవేక్షించారు. తరువాత వరద ఉధృతిని పరిశీలించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన వరద సమీక్షలో ఆయన మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఎస్పీ రోహిత్‌రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, ఆర్డీవో దామోదర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కర్ణాటకలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతుండగా గేట్లన్నీ ఎత్తి దిగువ విడుదల చేస్తున్నారు. ఆయా ప్రాజెక్టులకును దాటుకుని జూరాలకు, అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణమ్మ ప్రవాహిస్తున్నది. ఆదివారం సాయంత్రానికి జూరాల ప్రాజెక్టుకు 1.11 లక్షల క్యూసెక్కుల వరద రాగా సోమవారం సాయంత్రానికి 1.69 లక్షల క్యూసెక్కులకు, శ్రీశైలం ప్రాజెక్టుకు 96 వేల క్యూసెక్కుల నుంచి 1.74 లక్షల క్యూసెక్కులకు వరద ప్రవాహం పెరిగింది. మరోవైపు తుంగభద్రకు భారీగా వరద వస్తుండటంతో 3 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. రాబోయే 24 గంటల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు మరింత వరద ప్రవాహం పెరిగే అవకాశముంది.


