హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిందన్న చందంగా తయారైంది ఏపీలో బనకచర్ల, పోలవరం ప్రాజెక్టుల పరిస్థితి. ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును చేపడితే.. అంతకుముందే నిర్మాణమవుతున్న పోలవరం ప్రాజెక్టుకు మళ్లీ సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) తేల్చిచెప్పింది.
బనకచర్ల ప్రాజెక్టుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సామర్థ్యాలన్నీ మారిపోతాయని తెలిపింది. అలా జరిగిన పక్షంలో గోదావరి బేసిన్లోని అన్ని రాష్ర్టాల అనుమతి తప్పనిసరి అని స్పష్టంచేసింది. ఈ మేరకు జీఆర్ఎంబీ కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)కి తాజాగా లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన పీఎఫ్ఆర్ (ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టు)ను కేంద్ర జల్శక్తిశాఖకు సమర్పించిన విషయం విదితమే.
ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుపై అభిప్రాయాలను తెలపాలని కేంద్రం సీడబ్ల్యూసీ, ఎన్డబ్ల్యూడీఏతోపాటు, కృష్ణా, గోదావరి రివర్బోర్డులకు, అన్ని రాష్ర్టాలకు సూచించింది. ఈ క్రమంలో బనకచర్లలింక్ ప్రాజెక్టుపై జీఆర్ఎంబీ తాజాగా తన పరిశీలనలను సీడబ్ల్యూసీకి పంపింది. పరోక్షంగా బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులివ్వకూడదనే సూచించింది. బనకచర్ల లింక్ ప్రాజెక్టును పోలవరం నుంచి చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ లింక్ ప్రాజెక్టు కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్వరూపాలు పూర్తిగా మారిపోతున్నాయని వెల్లడించింది.
టీఏసీ ఇచ్చిన అనుమతుల ప్రకారం పోలవరం డ్యామ్ ఎండీడీఎల్ 141 ఫీట్లు కాగా, లైవ్ స్టోరేజీ సామర్థ్యం 75 టీఎంసీలు, కుడి కాలువ సామర్థ్యం 12వేల క్యూసెక్కులు. ఇప్పుడు ఆ అనుమతులకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులు చేపడుతున్నదని, బేసిన్లోని రాష్ర్టాలు అనేకసార్లు కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశాయని జీఆర్ఎంబీ గుర్తుచేసింది. ఏపీ ప్రభుత్వం తాజాగా గోదావరి బనకచర్ల లింక్ చేపడితే పోలవరం కుడి కాలువకు సమాంతరంగా 1400 క్యూసెక్కుల తాడిపూడి కాలువను 80 కి.మీ పొడవు నుంచి ప్రకాశం బరాజ్ వరకు అంటే 105 కిలోమీటర్లకు పొడగించడంతోపాటు, కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 10వేల క్యూసెక్కులకు విస్తరించాల్సి ఉంటుందని తెలిపింది. పోలవరం కుడికాలువ ప్రవాహ సామర్థ్యాన్ని కూడా 28 వేల క్యూసెక్కులతో చేపట్టాల్సి ఉంటుందని వివరించింది. మొత్తంగా గోదావరి నుంచి రోజుకు నికరంగా 38 వేల క్యూసెక్కులు అంటే దాదాపు 3.5 టీఎంసీల జలాలను తరలించేందుకు వీలుగా పనులను నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇది టీఏసీ అనుమతులకు విరుద్ధమని జీఆర్ఎంబీ వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అనుమతులకు, ప్రస్తుతం ప్రతిపాదించిన పనులకు ఏమాత్రం పొంతన ఉండబోదని స్పష్టంచేసింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా డిజైన్లను మార్చాల్సి ఉంటుదని, కాలువ సామర్థ్యం కూడా పూర్తిగా మార్చాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్టును చేపట్టాలంటే మరోసారి టీఏసీ అనుమతులను తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అందుకు గోదావరి బేసిన్లోని అన్ని రాష్ర్టాల సమ్మతి తప్పనిసరి అని, ఆయా రాష్ర్టాలతో చర్చించాల్సి ఉంటుందని జీఆర్ఎంబీ తన నివేదికలో స్పష్టం చేసింది.
కృష్ణా డెల్టాకు పోలవరం నుంచి ఏపీ 80 టీఎంసీల నీటిని తరలిస్తున్నదని, ఈ నీటిలో తెలంగాణకు 44 టీఎంసీలు, మహారాష్ట్ర 14 టీఎంసీలు, కర్ణాటకకు 21 టీఎంసీల చొప్పున కేటాయించారని గోదావరి బోర్డు గుర్తుచేసింది. ప్రస్తుతం పోలవరం నుంచి బనకచర్లకు 200 టీఎంసీలను తరలిస్తే గతంలో అనుసరించిన ప్రొరేటా ప్రకారమే ఆ మూడు రాష్ట్రాలకూ వాటాల పంచాల్సి ఉంటుందని, కానీ పీఎఫ్ఆర్ రిపోర్టులో ఏపీ దానిపై ఎక్కడా స్పష్టతనివ్వలేదని వెల్లడించింది. పోలవరం నుంచి 2 టీఎంసీలను తరలిస్తే.. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఆపరేషన్ షెడ్యూల్ను మార్చాల్సి ఉంటుందని, దానికి అన్ని రాష్ట్రాలతో చర్చించి అనుమతి తీసుకోవడం తప్పనిసరని బోర్డు తేల్చి చెప్పింది.
గోదావరిలో వరద జలాలు ఎన్ని, మిగులు జలాలు ఎన్ని అన్నది కూడా తేల్చాల్సి ఉంటుందని, వరద జలాల గుర్తింపు, తరలింపుపై ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని కూడా జీఆర్ఎంబీ సూచించింది. ఆయా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాక ముందుకు పోవాల్సి ఉంటుందని బోర్డు తెలిపినట్టు సమాచారం. లేదంటే రాష్ర్టాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశముంటుందని కూడా బోర్డు ఆ లేఖలో సూచించినట్లు తెలిసింది.