‘తలసానికి చిన్నప్పటి నుంచి పేడ పిసికే అలవాటుంది. చాలాకాలం దున్నపోతులను కాసిండు’ అంటూ మంత్రి తలసానిని, యాదవ కులాన్ని కించపరిచేలా రేవంత్ చేసిన వ్యాఖ్యలను యాదవులు తీవ్రంగా ఖండించారు. రేవంత్‌రెడ్డి తన అగ్రకుల అహంకారాన్ని బయటపెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీపీసీసీ అధ్యక్షుడు క్షమాపణ చెప్పకపోతే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
Revanth reddy | హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ)/మన్సూరాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై యాదవులు భగ్గుమన్నారు. యాదవులను కించపర్చడం, కులాన్ని చులకన చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. యాదవుల ఆందోళనకు గొల్ల కురుమలు కూడా గొంతు కలిపారు. రేవంత్.. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. యాదవులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గాంధీభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో రేవంత్ ఎకడ తిరిగినా దున్నపోతులు, గొర్రె పొట్టేళ్లతో నిరసన తెలుపుతామని తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కులం పేరుతో కించపరిచేలా రేవంత్‌రెడ్డి బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘తలసానికి చిన్నప్పటి నుంచి పేడ పిసికే అలవాటుంది. చాలాకాలం దున్నపోతులను కాసిండు’ అంటూ మంత్రి తలసానిని, యాదవ కులాన్ని కించపరిచేలా రేవంత్ చేసిన వ్యాఖ్యలను యాదవులు తీవ్రంగా ఖండించారు. రేవంత్‌రెడ్డి తన అగ్రకుల అహంకారాన్ని బయటపెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అగ్ర కులస్థుడనే పొగరుతో బీసీ కులస్థులను అవమానపరుస్తున్నాడని మండిపడ్డారు.
పీక పిసకడమూ తెలుసు: బాలరాజ్యాదవ్
యాదవ, కురుమలకు పేడ పిసకడమే కాదు అవసరమైతే నీ (రేవంత్) ముఖానికి పేడ కొట్టడం.. నీ పీక పిసకడం కూడా తెలుసని తెలంగాణ రాష్ట్ర షీప్ అండ్ గోట్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ హెచ్చరించారు. మంత్రి తలసానిపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం హైదరాబాద్‌లోని నాగోల్ చౌరస్తాలో తెలంగాణ యాదవ, కురుమ సంఘం ప్రతినిధులు రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీకి పేడ కొట్టారు. ఈ సందర్భంగా బాలరాజు యాదవ్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు యాదవ, కురుమ కులస్థులను కించపరిచేలా ఉన్నాయని మండిపడ్డారు. పాలు పిండే, పేడ తీసే చేతులతోనే రాజకీయంగా నిన్ను బొంద పెడతామని రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. మంత్రి తలసానిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రంలో రేవంత్‌రెడ్డిని తిరుగనివ్వబోమని హెచ్చరించారు. మంత్రిపై రేవంత్ వ్యాఖ్యలు వ్యక్తిగతమా? కాంగ్రెస్ పక్షాన చేసినవా? అనే విషయాన్ని తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాగోల్ డివిజన్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు సతీశ్‌యాదవ్, నాయకులు దూదిమెట్ల శివయాదవ్, అంజయ్య కురుమ, మనోహర్, భిక్షపతి, విష్ణు, హరీశ్‌యాదవ్, రమేశ్‌యాదవ్, కడారి ప్రవీణ్, తోటకూరి విష్ణు, సుధాకర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
గాంధీభవన్‌ను ముట్టడిస్తాం: గొల్ల కురుమ హక్కుల పోరాట సమితి
యాదవ మంత్రిని ఆర్థిక, కుల అహంకారంతో దూషించిన రేవంత్‌రెడ్డి దుష్టుడు, చరిత్రహీనుడని గొల్లకురుమ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. 24 గంటల్లో గొల్ల, కురుమలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే గాంధీభవన్‌ను ముట్టడిస్తామని గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్రంలో రేవంత్ ఎకడ తిరిగినా దున్నపోతులు, గొర్రె పొట్టేలతో తరలివచ్చి నిరసన తెలుపుతామని తెలిపారు.
ఓయూలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం
యాదవ, కురుమలను అవమానిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం దహనం చేశారు. టీజీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు నక్క శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మంత్రి తలసానిని దూషించిన రేవంత్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు ప్రశాంత్, రమణ, శ్రీకాంత్, కిశోర్, శశిపాల్, రామకృష్ణ, మిథున్ప్రసాద్, అవినాశ్, నాగేంద్రరావు, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.