హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ 2016లో జారీచేసిన జీవో 16ను హైకోర్టు రద్దు చేసింది. డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరణ కోసం ఉద్యోగనియామక చట్టాన్ని సవరించడం ద్వారా సెక్షన్ 10ఏ ప్రకారం తీసుకొచ్చిన ఆ జీవోను కొట్టివేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ జరిగిందని పేర్కొంటూ పలువురు నిరుద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం మంగళవారం 40 పేజీల తీర్పును వెలువరించింది. జీవో 16 ప్రకారం ఇప్పటికే క్రమబద్ధీకరణ అయిన ఉద్యోగులను తొలగించవద్దని, వారిని రెగ్యులర్ ఉద్యోగులుగానే కొనసాగించాలని స్పష్టం చేసింది. ఇకపై అన్ని ఉద్యోగాలను చట్టప్రకారమే భర్తీ చేయాలని తెలిపింది. ఇక నిరుద్యోగుల పిటిషన్లపై విచారణ ముగిసినట్టు ప్రకటించింది.
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): క్రమబద్ధీకరించబడిన కాంట్రాక్ట్ లెక్చరర్లకు అనుకూలంగా హైకోర్టు తీర్పునివ్వడాన్ని తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రం స్వాగతించారు. ఈ తీర్పు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. నిరుద్యోగ సంఘాల పేరుతో కొందరు కోర్టునాశ్రయించారని, కానీ మొత్తంగా న్యాయం గెలిచిందని అభిప్రాయపడ్డారు. తీర్పుతో 5 వేలకు పైగా ఉద్యోగులకు కొత్త జీవితాన్ని ప్ర సాదించినట్టయిందని పేర్కొన్నారు. అధికారులు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.