Green India Challenge | తెలంగాణలో హరితహారం కార్యక్రమం తద్వారా దశాబ్దంలోనే ఏడుశాతం అడవులు పెరుగడం అద్భుతమైన విషయమని ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నార్వే మాజీ మంత్రి, గ్రీన్ బెల్డ్ అండ్ రోడ్ ఇన్స్టిట్యూట్ సంస్థ స్థాపకుడు ఎరిక్ సోల్హీమ్ అన్నారు. ఇది సీఎం కేసీఆర్ విజనరీ లీడర్ షిప్‌కు నిదర్శనమని, ఇదే స్ఫూర్తితో దేశంలోని ప్రతిరాష్ట్రం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బేగంపేటలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వంతో పాటు ఎంపీ సంతోష్ సైతం ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమం ద్వారా కదిలించారన్నారు. మనమందరం కలిసి పని చేస్తే, భూమిపై మనం సాధించలేనిదంటూ లేదనే నా ఆశయానికి సంతోష్ ఓ ప్రతిరూపంగా కనిపించారన్నారు.
ఆయన ప్రతీరోజు ప్రపంచంలో ఎక్కడో ఓ చోట నిరంతరం మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతుంటరనే విషయాన్ని చాలామంది పర్యావరణ మిత్రులు తనతో చెప్పారన్నారు. ప్లాస్టిక్ నియంత్రణ కోసం కార్యక్రమాలను రూపొందించి అమలు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. మన పూర్వీకులు ఎవరూ ప్లాస్టిక్‌ను వాడలేదన్నారు. కానీ, మనం కావాలని తెచ్చిపెట్టుకున్న ప్లాస్టిక్ భూతం నేడు నేలను మానవాళిని మింగేస్తుందన్నారు.
ఇది ఆగిపోవాలంటే ప్రతీ ఒక్కరూ జోగినిపల్లి సంతోష్ కుమార్ కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన ముగ్గురు పర్యావరణ వేత్తలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. వారితో మొక్కలు నాటించి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను విస్తరించేందుకు తనవంతు తోడ్పాటునందిస్తానన్నారు. కార్యక్రమంలో తనను భాగస్వామిని చేసినందుకు ఎంపీ సంతోష్‌కు ఎరిక్ సోల్హీమ్ ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం సంతోష్ మాట్లాడుతూ కార్యక్రమంలో సోల్హీమ్తో కలిసి మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ‘ఆయన స్ఫూర్తి’తో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని ఉధృతం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వృక్షవేదం, హరితహాసం బుక్‌లను అందజేశారు. కార్యక్రమంలో ప్రొక్లైమ్ సీఈఓ కెవిన్ కందస్వామి, సీఓఓ శశిధర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మెంబర్లు రాఘవ, కర్ణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.