లక్ష్మణచాంద, జూన్ 16: కోతులు వెంబడించడంతో భయాందోళనకు గురైన ఓ గీత కార్మికుడు పరిగెత్తి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం బాబాపూర్‌లో చోటుచేసుకొన్నది. గ్రామానికి చెందిన రమేశ్ గౌడ్ (48) బుధవారం సాయంత్రం కల్లు గీసేందుకు ఈతవనానికి వెళ్లాడు. అక్కడ ఉన్న కోతులు ఒక్కసారిగా రమేశ్‌ను వెంబడించాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి భయంతో పరిగెత్తాడు. ఈ క్రమంలో రమేశ్ ఒక్కసారిగా కుప్పకూలాడు. అక్కడే ఉన్న కొందరు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి ఇంటికి తీసుకెళ్లి, స్థానిక వైద్యుడికి చూయించేలోగా మృతిచెందాడు.