హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ఆడ పిల్లలు బయటకు వెళ్లారంటే.. వాళ్లు ఇంటికి వచ్చేవరకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కలవరపడుతారు. ఇంటికి తిరిగి వచ్చారంటే క్షేమంగా ఉన్నట్టు భావిస్తారు. కానీ ప్రస్తుతం సమాజంలో పరిస్థితి చూస్తుంటే ‘ఇంట్లో ఆడబిడ్డలకు రక్షణ ఉందా?’ అంటే.. కచ్చితంగా అవును అని చెప్పలేని దుస్థితి నెలకొన్నది. ప్రమాదం ఎప్పుడు ఎవరి నుంచి పొంచి ఉన్నదో అర్థం కాదని చెప్పే దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి. బంధువులు, స్నేహితులు, ప్రేమికులు, సహోద్యోగులే కాదు.. ఆఖరికి కుటుంబ సభ్యుల నుంచి కూడా రక్షణలేదని చాటిచెప్పే దయనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నిరుడు చిన్న పిల్లలపై జరిగిన లైంగిక దాడుల్లో 99 శాతం మంది నిందితులు తెలిసినవాళ్లే కావడం ఇందుకు నిదర్శనం. పోలీసుశాఖ విడుదల చేసిన నేరాల వార్షిక నివేదిక-2025లో ఇలాంటి సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2025లో జనవరి నుంచి నవంబర్ చివరి వరకు నమోదైన 2,549 లైంగిక దాడుల కేసులలో 2,523 కేసులలో.. అంటే 99 శాతం కేసులలో నిందితులుగా తెలిసిన వ్యక్తులే ఉన్నారు. అంతేకాకుండా 230 కేసుల్లో చుట్టుపక్కల వారే నిందితులుగా ఉన్నారంటే శాంతిభద్రతలు ఎంతలా క్షీణించాయో అర్థం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
పోక్సో కేసులు.. దారుణ నిజాలు
తెలంగాణలో చిన్నారులపై రోజుకు మూడు అఘాయిత్యాలు జరిగినట్టు కేసులు నమోదవుతున్నాయి. మొత్తం పోక్సో చట్టం కింద రోజుకు 8 ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. 2025లో 819 మంది చిన్నారులపై లైంగిక దాడులు జరిగాయి. సుమారు 2,570 మంది చిన్నారులపై వేధింపులు జరిగినట్టు కేసులు నమోదయ్యాయి. కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన ఉమెన్ సేఫ్టీ వింగ్‌లోని ‘భరోసా’ విభాగం బాధిత చిన్నారులకు అండగా ఉంటున్నది. నిరుడు కేవలం 81 మందికి మాత్రమే శిక్షలు పడగా 1,454 మందికి మాత్రమే పరిహారం అందింది.
నమ్మించి.. వేధించి.. వంచించి
రాష్ట్రంలో రోజుకు సగటున 10 లైంగిక దాడుల కేసులు నమోదవుతున్నాయి. వీటిలో దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలు 30 శాతం ఉన్నాయి. పెండ్లి చేసుకుంటానని, ఉద్యోగం ఇప్పిస్తానని, ఉద్యోగోన్నతి కల్పిస్తానని మాయమాటలు చెప్పి మోసం చేసిన వారిపై బీఎన్ఎస్ సెక్షన్ 69 కింద కొత్తగా 843 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో రెండేండ్లలో నేరాలు దారుణంగా పెరిగాయి. 2024 కంటే 2025లో లైంగిక దాడులే 14శాతం పెరిగాయి. మహిళలు పనిచేసే ప్రదేశాల్లోనూ భద్రంగా లేరని పోలీసు లెక్కలు చెప్తున్నాయి. 2025లో పని ప్రదేశాల్లో 217 లైంగిక దాడుల కేసులు నమోదయ్యాయి. మహిళా ఉద్యోగుల నుంచి ‘సాహస్’ అనే సంస్థకు 108 ఫిర్యాదులు అందాయంటే పరిస్థితి ఎంద దారుణంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం హోంశాఖ, పోలీసు అధికారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, శాంతిభద్రతలను పరిరక్షించాలని ప్రజాసంఘాల ప్రతినిధులు, సామాజికవేత్తలు కోరుతున్నారు.