హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే టీజీ ఎప్‌సెట్ దరఖాస్తుల్లో ఈ సారి అమ్మాయిల జోరు కనిపిస్తున్నది. ఇప్పటివరకు అమ్మాయిలే అధికంగా దరఖాస్తు చేసుకున్నారు. శనివారం వరకు ఎప్‌సెట్‌కు 2,89,974 దరఖాస్తులొచ్చాయి. ఈ సారి అత్యధికంగా అమ్మాయిలు 1,54,667 దరఖాస్తులు సమర్పించగా, అబ్బాయిలు 1,35,307 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఎప్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. నిరుడు మూడు లక్షల దరఖాస్తులు రాగా ఈ సారి కాస్త తగ్గాయి. ఆదివారం నుంచి రూ. 250 జరిమానాతో దరఖాస్తు చేసుకునే అవకాశమున్నది. రూ. 10వేల ఆలస్య రుసుముతో మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
6 నుంచి ఎడిట్ ఆప్షన్..
ఎప్‌సెట్ దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సవరించుకొనేందుకు జేఎన్టీయూ అధికారులు అవకాశం కల్పించారు. ఈ నెల 6 నుంచి 8 వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. తల్లిదండ్రుల పేర్లు, ఎడ్యుకేషన్ వివరాలు మాత్రమే ఎడిట్చేసుకోవచ్చు. కులం, పుట్టిన తేదీ, సెంటర్ ప్రాధాన్యత వంటి వివరాలు ఎడిట్ చేసుకోవడానికి వీల్లేదు. దరఖాస్తులు మూడు లక్షలకు సమీపించడంతో గ్రామీణ ప్రాంతాల్లోని సెంటర్లు హౌజ్‌ఫుల్ అయ్యాయి. కేవలం హైదరాబాద్‌లోని టెస్ట్ జోన్లు మాత్రమే మిగిలిఉన్నాయి.