హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : న్యూస్ పేపర్ పంపిణీదారులకు గిగా వర్కర్స్ చట్టాన్ని వర్తింపజేయాలని తెలంగాణ ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల సత్యం ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు శనివారం కార్మిక, ఉపాధి కల్పనశాఖ కార్యదర్శి హరిచందనకు వినతిపత్రం అందజేశారు. గిగా వర్కర్స్కు అందిస్తున్న సంక్షేమ ఫలాలను దినపత్రికల పంపిణీదారులైన ఏజెంట్లు, వెండర్లు, పేపర్ బాయ్స్‌కు అమలుచేయాలని కోరారు. ఇందుకు ఆమె సానుకూలంగా స్పందించినట్టు యూనియన్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి వెన్నె రవి, ఉపాధ్యక్షుడు దోమల లింగమూర్తి పాల్గొన్నారు.
హైదరాబాద్, మే 17(నమస్తే తెలంగాణ) : తమ కులస్తుల సంక్షేమం కోసం రూ.200 కోట్లతో కుమ్మర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ కుమ్మర సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీలో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కుమ్మర్లను బీసీ ‘బీ’ నుంచి బీసీ ‘ఏ’కు మార్చాలని, 50ఏండ్లు దాటిన వారికి నెలకు రూ.5వేల పింఛన్ ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు నడికుడి జయంత్‌రావు, ప్రధాన కార్యదర్శి మల్కాజిగిరి దయానంద్ కోరారు. రాష్ట్రంలోని 33 జిల్లాకేంద్రాల్లో వృత్తి శిక్షణ కేంద్రాలను నెలకొల్పాలని, ఆత్మగౌరవ భవనానికి రూ.5కోట్లు, అసెంబ్లీలో ప్లాస్టిక్‌పై నిషేధం విధిస్తూ తీర్మానం చేయాలని కోరారు. 33 జిల్లా కమిటీలు వేసి, త్వరలోనే భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు. సంఘం నేతలు ఏడుకొండల వెంకటేశం, డాక్టర్ కంభంపాటి సత్యనారాయణ, బండారి భిక్షపతి, కే లక్ష్మీనారాయణ, టీకే శ్రీనివాస్, చందర్రావు, వీరేశం పాల్గొన్నారు.