Hanumakonda | ఐనవోలు, మార్చి 2 : ఓ అన్న చెల్లికి అరుదైన బహుమతి అందజేసి ఆశ్చర్యపరిచాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన వడిచెర్ల శ్రీనివాస్ నిరుడు జనవరి 22న మరణించాడు. అతని కూతురు శివాణి వివాహం ఆదివారం ఐనవోలులోని మల్లికార్జునస్వామి గార్డెన్లో జరిగింది. అయితే వధువు సోదరుడు కమల్‌హాసన్ తండ్రి విగ్రహాన్ని బహుమతిగా అందించి చెల్లిని ఆశ్చర్యపరిచాడు. విగ్రహాన్ని చూసిన వధువుతోపాటు కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనై రోధించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు శ్రీనివాస్ విగ్రహంతో ఫొటో దిగి గత స్మృతులను గుర్తుచేసుకున్నారు.