నేరేడ్మెట్, జూలై 27: రాష్ట్రంలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో స్వైరవిహారం చేస్తూ జనాలను తీవ్రంగా గాయపరుస్తున్నాయి. శుక్రవారం ఉదయం మల్కాజిగిరి డివిజన్ కృపా కాంప్లెక్స్ సమీపంలో జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికురాలు కమలమ్మపై వీధి కుక్క దాడి చేసింది. ఇంతలో ఓ ద్విచక్రవాహనదారుడు అక్కడికి రావడంతో కుక్క పారిపోయింది. కానీ, అప్పటికే కమలమ్మ రెండు కాళ్లపై కొరికి తీవ్రంగా గాయపర్చింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం నారాయణగూడలోని దవాఖానకు తరలించారు. ఈ దృశ్యాలన్నీ సమీపంలోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఆ వీడియోను స్థానిక కార్పొరేటర్ శ్రమణ్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. వీధి శునకాలను ఎవరూ చేరదీయవద్దని, ఇండ్ల ముందు వాటికి అన్నం పెట్టవద్దని కోరారు.
రాష్ట్రంలో పెరిగిన ‘పోక్సో’ శిక్షల రేటు
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పోక్సో కేసులకు సంబంధించిన శిక్షలు పెరుగుతున్నట్టు తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖాగోయెల్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే 12 కేసుల్లో దోషులకు కఠిన కారాగార శిక్ష పడినట్టు చెప్పారు. రెండేండ్లలో నమోదైన 42 పోక్సో కేసుల్లో విచారణ, శిక్షల రేటు మెరుగైన స్థితిలో ఉన్నదని వివరించారు. ఈ ఏడాది ఇద్దరికి జీవిత ఖైదు, ఒకరికి 25 ఏండ్లు, ఐదుగురికి 20 ఏండ్లు, మరొకరికి ఐదేండ్ల జైలు శిక్ష విధించడంతోపాటు ముగ్గురికి ఏడాదిపాటు సామాజిక సేవ చేసే శిక్ష విధించినట్టు తెలిపారు. పోక్సో కేసుల్లో దోషులకు కఠిన శిక్షలు పడేలా చూస్తున్న దర్యాప్తు అధికారులు, పీపీలు, డాక్టర్లు, కౌన్సెలర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఆమె అభినందించారు.