న్యూఢిల్లీ: ఏదైనా విషయాన్ని అవతలి వ్యక్తికి చెప్పేటప్పుడు కేవలం నోటితోనే చెప్పడం కన్నా దానికి సంజ్ఞలు జోడిస్తే మరింత ప్రేరణగా, అనునయ పూర్వకంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. మీరు ఒక ప్రజంటేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు, ఒక ఆలోచన గురించి చెప్పాలనుకున్నప్పుడు, ఒక సమావేశానికి నేతృత్వం వహించాలనుకున్నప్పుడు బహుశా ఏం చెప్పాలనుకున్న విషయంపైనే ఎక్కువ సమయం ఆలోచిస్తుంటారు. తాము చెప్పే అంశాన్ని వివరించడానికి చేతులతో ఎలాంటి సంజ్ఞలు చేయాలో అనే విషయం గురించి ఎవరూ ఆలోచించరు. వక్తలు తాము చెప్పే విషయం గురించి దృశ్యరూపంలో సూచించే చేతి సంజ్ఞలను ఉపయోగించినప్పుడు శ్రోతలకు వారు చెప్పిన విషయం స్పష్టంగా, సమర్థంగా, ఒప్పించేలా చేరుతుంది.
జర్నల్ ఆఫ్ మార్కెట్ రీసెర్చ్‌లో ప్రచురించిన తన కొత్త పరిశోధనలో ఇది కీలకమైన విషయమని, తాను వేలాది టీఈడీ టాక్‌లను విశ్లేషించానని, సంజ్ఞ లు కమ్యూనికేషన్‌ను ఎలా రూపొందిస్తాయో పరిశీలించడానికి నియంత్రిత ప్రయోగాలను నిర్వహించానని ప్రముఖ టీఈడీ స్పీకర్ ఒకరు తెలిపారు. వాస్తవానికి సంజ్ఞలు శ్రోతలకు ఒక సత్వర దృశ్య మార్గాన్ని ఇస్తాయని తాను కనుగొన్నట్టు చెప్పారు. ఆలోచనలను నిర్దిష్ట పరుస్తాయన్నారు. దీనిని మనస్తత్వ వేత్తలు ప్రాసెసింగ్ ఫ్లూయెన్సీ అని పిలుస్తారని తెలిపారు. అలా అని అన్ని సంజ్ఞలు సంభాషణకు ఉపయోగపడవని చెప్పా రు. మనం చెప్పే విషయాలకు, చేసే సంజ్ఞలకు పొంతన లేనప్పుడు అవి వారికి ఉపయోగపడకపోగా శ్రోతలను మరింత గందరగోళం లోకి నెడుతాయని అన్నారు.