హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): షామీర్పేట్లో విస్తరించిన జీనోమ్ వ్యాలీ ఉపాధికి స్వర్గధామంగా మారింది. ప్రస్తుతం 20 వేల మందికిపైగా ప్రత్యక్షంగా, మరో 10 వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఒకప్పుడు 50 మందితో కార్యాకలాపాలు చేపట్టిన ఫార్మా కంపెనీలు ఇప్పుడు వేల మందికి ఉపాధినిస్తున్నాయి.
దాదాపు 700 ఎకరాల్లో విస్తరించిన జీనోమ్ వ్యాలీలో చిన్నా, పెద్ద కలిపి 250కి పైగా ఫార్మా, బయోటెక్, లైఫ్ సైన్సెస్ కంపెనీలు కొలువుదీరగా, వీటిలో 30 శాతం కంటే ఎక్కువ మంది ఇతర రాష్ర్టాల వారు కూడా ఉపాధి పొందుతున్నారు. ఒకేసారి వందల ఎకరాల్లో ఫార్మా కంపెనీలు విస్తరించడంతో స్థానికులతోపాటు స్థానికేతరులకు కూడా చేతి నిండా పని దొరుకుతున్నది. కొంతమంది రోజూ సిద్దిపేట నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకునే స్థాయికి జీనోమ్ వ్యాలీ ఎదిగింది.
జీతానికి ఢోకాలేదు
ఒకప్పుడు కూలీ పనులతో జీవితాన్ని నెట్టుకొచ్చిన ఎంతోమంది ఇక్కడ కనీసం నెలకు రూ. 15 నుంచి 25 వేల వరకు సంపాదించుకొనే అవకాశం వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. పదో తరగతి వరకే చదివిన తనకు ఫార్మా కంపెనీల విస్తరణతో స్థానికంగా నెలకు రూ. 18 వేలు సంపాదించుకొనే మార్గం దొరికిందని సెక్యూరిటీ గార్డు రాజు చెప్పారు. ఈఎస్ఐ, పీఎఫ్ వంటి అదనపు ప్రయోజనాలతో తన జీవితానికి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు వ్యవసాయ కూలీగా పనిచేసిన కోల్తూరు గ్రామానికి చెందిన ఓ మహిళ.. ప్రస్తుతం పరిమిత గంటల పనితో కుటుంబాన్ని పోషిస్తున్నట్టు తెలిపారు.
నిపుణులకు పుష్కలమైన అవకాశాలు
ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయాలజీలో ఉన్నత చదువులు చదివిన వారంతా ఒకప్పుడు ఉద్యోగాల కోసం బోధన రంగాన్ని నమ్ముకొనేవారు. కానీ జీనోమ్ వ్యాలీలో కార్యాకలాపాలు విస్తరించడంతో ఇక్కడ ఊహించని స్థాయిలో జీతాలు పొందుతున్నారు. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాలకు హైదరాబాద్ నిలయంగా మారడంతో.. ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన వారంతా.. ఇప్పుడు సిటీ వైపు చూస్తున్నారు. వచ్చే ఏడేండ్లలో మరో 30 వేల మందికి ఉపాధినిచ్చే స్థితికి జీనోమ్ వ్యాలీ ఎదుగుతుందని అధికారులు చెప్తున్నారు.