హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో బదిలీలు, పోస్టింగ్‌ల వెనుక భారీ ఎత్తున ముడుపులు చేతులు మారుతున్నట్టు తెలుస్తున్నది. గతంలో డిస్కంలకే పరిమితమైన ఈ దందా.. ఇప్పుడు జెన్కోకు కూడా పాకినట్టు, ఒక్కో బదిలీ లేదా పోస్టింగ్‌కు సంబంధిత అధికారులు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ముడుపులు పుచ్చుకుంటున్నట్టు సమాచారం. జెన్కోలో ఎలాంటి విధానం, మార్గదర్శకాలు లేకుండానే బదిలీ ఉత్తర్వులు విడుదలవుతున్నాయి.
తాజాగా జెన్కో యాజమాన్యం ఐదుగురు ఇంజినీర్లను బదిలీ చేసింది. నేడో, రేపో మరో ముగ్గురిని బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి పోస్టింగ్స్ ఇస్తున్నారు. అలా ఒక చోటున్న పోస్టును జెన్కో ప్రధాన కార్యాలయానికి షిఫ్ట్ చేశారని ఓ ఇంజినీర్ ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అక్రమ బదిలీలను ఆపాలని కోరుతున్నారు.
ఏటా వేసవిలో ఇంజినీర్ల బదిలీలు చేపట్టాలి. ఆ బదిలీల్లో 10 ఏండ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారికి, ఆరోగ్య సమస్యలున్నవారికి ప్రాధాన్యమివ్వాలి. కానీ, గత రెండేండ్లుగా సాధారణ బదిలీలు చేపట్టిన దాఖలాల్లేవు. జెన్కోలో మొత్తం 214 మంది ఇంజినీర్ల బదిలీల దరఖాస్తులను యాజమాన్యం పెండింగ్ పెట్టింది. మెడికల్ తదితర కోటాలో గత ఏడాదిన్నరగా ఒక్కరిని బదిలీ చేయలేదు. కానీ పలుకుబడితో బదిలీలు జరుగుతున్నాయి.