సుల్తాన్‌బజార్, డిసెంబర్ 24: పదిహేను రోజుల్లో ఆర్డర్ కాపీలు ఇస్తామని చెప్పి నాలుగు నెలలైనా పట్టించుకోకపోవడంపై జెన్కో, ఏఈ అండ్ కెమిస్ట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మంగళవారం నాంపల్లిలోని గాంధీభవన్ ఆవరణలో ఆర్డర్ కాపీలు ఇవ్వాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అభ్యర్థులు మాట్లాడుతూ.. 2023 అక్టోబర్ 4న జెన్కో నోటిఫికేషన్ ఇవ్వగా, ఈ ఏడాది జూలై 14న పరీక్ష నిర్వహించారని, ఆగస్టు 18న ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించారని చెప్పారు. వెరిఫికేషన్ సమయంలో 15 రోజుల్లో నియామక ఉత్తర్వులు ఇస్తామని తెలిపి నాలుగు నెలలు గడుస్తున్నా ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 3న ఆర్డర్ కాపీల విషయమై ఇంధన శాఖ మంత్రిని, 4 సార్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసిన కనీస స్పందన కరువైందని వాపోయారు. అన్ని విద్యార్హతల ఒరిజినల్ డాక్యుమెంట్లను వారి వద్దనే ఉంచుకోవడంతో ఎక్కడా పని చేయలేక ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.