హైదరాబాద్, జూన్ 14(నమస్తే తెలంగాణ): రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలన్ననే తమ సంకల్పమని జెన్‌జీ యువతులు ముందుకొచ్చారు. నిత్యం పార్టీ కార్యకలాపాలతో రాజకీయ వాతావరణం ఉండే బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నలుగురు యువతులు రావడం, తమ ఆలోచనలను కేటీఆర్‌తో పంచుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. లండన్‌లోని కింగ్స్ కాలేజీలో పాలిటీ, ఎకానమీ అండ్ ఫిలాసఫీ చదువుతున్న సరయు, నల్సార్ లా విద్యార్థిని లాస్య, సింబయాసిస్ స్కూల్ విద్యార్థిని రేవతి, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో బీకాం చదువుతున్న అశ్విని ఆదివారం ఉదయం కేటీఆర్‌ను కలిశారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలనున్నదని చెప్పగా, ఇందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించి మీ రాజకీయ ప్రయాణంలో అండగా ఉంటానని భరోసానిచ్చారు.
కొత్త ఆశలు చిగురిస్తున్నాయి
జెన్‌జీ యువతలోని ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యతపై వారికి ఉన్న ఆసక్తిని చూస్తుంటే భవిష్యత్‌పై కొత్త ఆశలు చిగురిస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కెరీర్ మాత్రమే లక్ష్యంగా జాబ్‌ల కోసం తపనపడే ఈ రోజుల్లో నలుగురు ఆడబిడ్డలు తనను కలిసి రాజకీయాల్లోకి వస్తామని ఆసక్తి చూపడంపై ‘ఎక్స్’ వేదికగా ఆనందం వ్యక్తంచేశారు. రాజకీయాసక్తితో తన వద్దకు వచ్చిన నలుగురిని చూసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. పార్టీ ఆఫీసులోని తన బృందంతో కలిసి పనిచేసేందుకు అవకాశం కల్పిస్తానని, వారి పొలిటికల్ జర్నీలో తగిన సూచనలు, మద్దతు అందిస్తానని హామీ ఇచ్చారు. తమ భవిష్యత్ లక్ష్యాలే, రాజకీయాలపై దృక్పథాన్ని పంచుకున్న ఈ యువతులు పార్టీ కార్యాలయంలో గడిపిన సమయం తమకు ప్రేరణనిచ్చిందని స్పష్టంచేశారు. రాజకీయాల్లోకి కొత్త తరం వస్తేనే మార్పు వస్తుందని భావిస్తున్న తరుణంలో నలుగురు యువతుల సంకల్పం చూశాక గర్వంగా ఫీలవుతున్నానని చెప్పారు. కేటీఆర్‌తో మాట్లాడిన యువతులు త్వరలో తమ బృందంతో వచ్చి కలుస్తామని తెలిపారు. కేటీఆర్‌ను నేరుగా మాట్లాడటం, తమ ఆలోచనలను పంచుకోవడం గొప్పగా అనిపించిందని చెప్పారు.