‘ఇది ‘గేదెలరాజు’ అనే రౌడీషీటర్ కథ. చిన్నప్పుడు మా తాతయ్య మహాభారతం చదివి వినిపించేవారు. ఆయన చెప్పిన కథల్లో కనికుడి పాత్ర నాకు గుర్తుండిపోయింది. దృతరాష్ర్టుడి పక్కనే ఉండే కనికుడు పరమ దుర్మార్గుడు. ఎదురొచ్చినవాడ్ని సమయం చూసి దెబ్బ కొట్టాలనేది అతని నైజం. అడ్డొచ్చినవాడు కొడుకైనా కనికుడు కనికరం చూపించడు. ఇదే కనికనీతి. దీని గురించి ఇప్పటిదాకా మన సినిమాల్లో ఎవరూ చెప్పలేదు.
కొత్తగా ఉంటుందని ‘గేదెల రాజు’ సినిమాలో పెట్టాను’ అన్నారు దర్శక,నిర్మాత చైతన్య మోటూరి. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘గేదెలరాజు’. ‘కాకినాడ తాలూకా’ అనేది ఉపశీర్షిక. కుంచె రఘు ప్రధానపాత్రధారి. వికాస్, టీనా శ్వావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి ఇతర పాత్రధారులు. వాణి రవికుమార్ మోటూరి నిర్మాత. ఈ నెల 24న సినిమా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా దర్శక,నిర్మాత చైతన్య మోటూరి విలేకరులతో మాట్లాడారు. ‘రౌడీషీటర్ గేదెలరాజు పాత్రకు రఘు కుంచె పర్ఫెక్ట్గా సెట్ అవుతారన్న నమ్మకంతో ఆయన్ను ఆ పాత్రకు తీసుకున్నాం. కాకినాడ పరిసరాల్లో రౌడీల గురించి నాకు తెలిసిన విషయాలు, అక్కడ జరిగిన సంఘటనలు ఇవన్నీ ఈ కథలో ఉంటాయి.
తొలి ప్రయత్నం విభిన్నంగా ఉండాలనే ఉద్దేశంతోనే విలన్ పాత్రనే మెయిన్ చేసి, ఆసక్తిని రేకెత్తించేలా సినిమా తీశాను. రఘు కుంచె నటనతోపాటు సంగీతం కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సినిమా చూస్తున్నవారు కథలోని ట్విస్ట్‌ని ముందుగా కనిపెట్టలేరు. వర్తమానంలో, గతంలో జరిగినవి చూపిస్తూ సాగే మర్డర్ మిస్టరీ కథ ఇది’ అని తెలిపారు. దర్శక,నిర్మాత చైతన్య మోటూరి.