హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని అటవీ ప్రాంతాల నుంచి గిరిజనులు సేకరించిన స్వచ్ఛమైన పుట్ట తేనెను ‘గిరి నేచర్’ పేరుతో రాష్ట్ర గిరిజన సంహకార సంస్థ (జీసీసీ) ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ప్రాసెసింగ్‌కు ఎలాంటి రసాయనాలను ఉపయోగించని ఈ తేనెను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఇప్పటికే జీసీసీ మామిడి తేనె, వేప తేనె, నువ్వుల తేనె, పాల కొడిశ తేనెను విక్రయిస్తున్నది. ఫ్లిప్‌కార్ట్, క్యూ-మార్ట్ల ద్వారా వీటిని నేరుగా కొనుగోలు చేయవచ్చని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ తెలిపారు. ఇప్పటివరకు గిరిజనులు కిలో తేనెకు రూ.220 పొందేవారని, ‘గిరి నేచర్’ తేనెతో వారికి 54 శాతం అదనపు ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. జీసీసీ విక్రయిస్తున్న తేనెల్లో ఉండే విభిన్న బయోయాక్టివ్ సమ్మేళనాలు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబియల్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయని, జలుబు, గొంతు నొప్పి, చర్మ వ్యాధుల నివారణకు ఈ తేనెలు ఔషధంగా పనిచేస్తాయని వివరించారు. గిరిజనుల ఆదాయాన్ని పెంచడంతోపాటు ప్రజలకు స్వచ్ఛమైన తేనెను అందుబాటులో తెచ్చిన జీసీసీని సీఎస్ అభినందించారు.