హైదరాబాద్, జూలై 22(నమస్తే తెలంగాణ) : రేవంత్‌రెడ్డి పాలన పూర్తిగా అరాచకమయమైందని, ఆర్థిక అరాచకవాది చేతిలో రాష్ట్రం ఆగమైపోతున్నని బీఆర్ఎస్ సీనియర్ నేత గట్టు రామచందర్‌రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. క్రిమినల్ చేతిలో హోమ్ శాఖ ఉండటం వల్ల రాష్ట్రంలో నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ఈ ఏడాది 14శాతం క్రైమ్ రేట్ పెరుగడం రేవంత్‌రెడ్డి ఘనతేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తొమ్మిది నెలల్లో వెయ్యి హత్యలు జరిగాయని, హంతకులు సెల్ఫీలు తీసుకుని మరీ హత్యలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
పోలీసులు శాంతిభద్రతలను గాలికొదిలి, సీఎం మనుషుల సేవలో తరిస్తున్నారని, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడానికే సమయం వెచ్చిస్తున్నారని ఆగ్రహించారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు జుట్టుపట్టుకొని ఈడ్చుకెళ్లడం సర్వసాధారణం అయిందని దుయ్యబట్టారు. గాంధీభవన్ బూతులకు అడ్డాగా మారిందని, కొందరికి క్యాబినెట్ హోదా ఇచ్చి మరీ బీఆర్ఎస్ నేతలను తిట్టిస్తున్నారని నిప్పులుచెరిగారు. ‘అబద్ధాలు+బూతులు=కాంగ్రెస్ పార్టీ’ అన్నట్టుగా వారి తీరు ఉన్నదని విమర్శించారు.
రాహుల్‌గాంధీ తీరు.. ఒక దేశం రెండు విధానాలు అన్నట్టుగా ఉన్నదని రామచందర్‌రావు విమర్శించారు. ఢిల్లీలో మోదీపై కొట్లాడుతూ, హైదరాబాద్‌లో మాత్రం మోదీ జోడీ రేవంత్‌రెడ్డికి వంతపాడుతున్నారని చురకలంటించారు. ఢిల్లీలో ధర్నాలు చేసే రాహుల్, తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. రేవంత్‌రెడ్డి వేల ఎకరాలు కొల్లగొట్టి అక్రమంగా డబ్బులు వెనకేసుకొంటున్నారని, ఎకరాలను బకరాలకు అమ్ముకొని కడుపు నింపుకొంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. త్వరలోనే ఆయన బండారం బయటపడుతుందని హెచ్చరించారు.
గతంలో కడుపు కట్టుకొంటే పథకాలు అమలు చేయొచ్చన్న రేవంత్.. ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విరుచుకుపడ్డారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టడం పకా అని, పాత కాంగ్రెస్ నాయకులు ఆయనను పట్టించుకోవడం లేదని, సరైన సమయం కోసం వేచిచూస్తున్నారని వ్యాఖ్యానించారు. బీఎల్వోల పనితీరుపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన ఫ్యూడల్ మనస్తత్వానికి అద్దం పడుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ఈ అరాచక పాలన పోవాలంటే రేవంత్‌రెడ్డి తన పదవి నుంచి తప్పుకోవాలని రామచందర్‌రావు డిమాండ్ చేశారు.