Eagle Squad | హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 9 నెలల్లోనే సుమారు 188 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో హతమయ్యారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నా.. కాకులు దూరని కారడవిలోనూ భద్రతా దళాలు లక్ష్యాన్ని ఛేదించగలిగాయి. అందుకు కారణం ‘ఈగల్ స్కాడ్’ అని పలువురు రిటైర్డ్ ఐపీఎస్‌లు చెప్తున్నారు. ఆర్మీ నుంచి తెలంగాణ పోలీసుల వరకు గరుడ దళాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. పూర్వం లేఖలను పంపేందుకు పావురాలను, గూఢచర్యానికి డేగలను, వేటకు జాగిలాలను, ప్రయాణానికి అశ్వాలను వినియోగించినట్టే.. ఇప్పుడు ‘ఆపరేషన్ కగార్’కు ‘గరుడ దళం’ సహకారం కేంద్ర హోంశాఖ తీసుకుంటున్నది. సంఘ విద్రోహ శక్తుల చర్యలను పసిగట్టేందుకు, రక్షణ, రహస్య ప్రదేశాల్లో ఎగిరే డ్రోన్లను పట్టుకునేందుకు 2020లో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా గద్దలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మొయినాబాద్‌లో కొన్ని గద్దలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. వాటిని మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర హోంశాఖ ఉపయోగించిందని పలువురు చెప్తున్నారు.
ఎక్కడ నక్కి ఉన్నా.. పసిగట్టే ‘కన్ను’
కేంద్ర ప్రభుత్వం 2026 నాటికి దేశంలో మావోయిస్టు వ్యవస్థ ఉండొద్దనే లక్ష్యంతో చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’కు తెలంగాణలో శిక్షణ పొందిన, పొందుతున్న గద్దలను వినియోగించినట్టు విశ్వసనీయ సమాచారం. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా ఈగల్ స్వాడ్ ను ఏర్పాటు చేసుకున్నారని, ప్రత్యేక శిక్షణ పొందిన గద్దలతో డ్రోన్ దాడులకు చెక్ పెట్టవచ్చని నాటి డీజీపీ రవి గుప్తా ఓ సందర్భంలో చెప్పారు. వాటి కాళ్లకు జీపీఎస్ ట్రాకర్, మెడకు, రెక్కల కింద మైక్రో కెమెరాలు అమర్చినట్టు తెలిసింది. వీటి ద్వారానే మావోయిస్టుల సమాచారం తెలుసుకొని, పథకం ప్రకారం కాల్పులు జరిపారని పలువురు అంటున్నారు. వానకాలం, చలికాలాల్లో వాతావరణం ప్రతికూలంగా ఉన్నా.. పోలీసులు విజయం సాధించడానికి ముఖ్యకారణం గరుడ దళమేనని స్పష్టంచేస్తున్నారు. కొంతకాలంగా కోవర్టు ఆపరేషన్లకు ప్రాధా న్యం ఇస్తున్న భద్రతా బలగాలు.. అదను చూసి ఇన్ఫార్మర్లనూ హతమారుస్తున్నట్టు తెలిసింది. తాజా ఎన్కౌంటర్లో కొందరు ఇన్ఫార్మర్లు కూడా ఉన్నట్టు చెప్తున్నారు.
గరుడ దళం ప్రత్యేకతలివే..
తొలుత నిఘాలో పావురాలకు శిక్షణ ఇద్దామని భావించినా అవి ప్రతికూల వాతావరణంలో ఎగరలేకపోవడంతో డేగలవైపు మళ్లారు. డేగలు తుఫాను సమయంలోనూ మేఘాల కంటే ఎత్తులో వెళ్లి అవిశ్రాంతంగా పనిచేస్తాయి. దీంతో నల్లమల అడవుల్లోంచి రెండేళ్ల వయసున్న డేగ పిల్లలను తెచ్చి వాటికి మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (ఐఐటీఏ)లోప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సంఘ విద్రోహక శక్తులు ఉపయోగించే డ్రోన్లను సులభంగా గుర్తించేలా తర్ఫీదునిచ్చారు. అవి రెండు కిలోల దాకా బరువును కూడా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు సులభంగా మోసుకురాగలవు. ప్రధాని, ఇతర ప్రముఖుల పర్యటనల సందర్భంగా డ్రోన్లపై నిషేధం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో డేగలు నిఘా పెట్టి మరీ ఏవైనా డ్రోన్లు గాల్లోకి ఎగిరితే వాటిని పట్టుకొచ్చి, అధికారులకు అప్పగిస్తాయి. డేగలకు అమర్చే కెమెరాల ద్వారా నిషేధిత, అనుమానిత ప్రాంతాల్లో వ్యక్తుల కదలికలను రికార్డ్ చేస్తుంటారు. ప్రపంచంలో ఇలాంటి డేగలు ఒక నెదర్లాండ్స్‌లోనే ఉన్నాయని నాటి డీజీపీ రవిగుప్తా మీడియాకు తెలిపారు.